రాత్రి వేళ  రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ బంద్‌

 

న్యూఢిల్లీ: ప్రయాణికుల సేవలను కరోనా ముందు నాటి సాధరణ స్థితికి తీసుకు వచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా వారం రోజులపాటు రాత్రి వేళ రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)ను మూసివేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం నుంచి ఈ నెల 21 వరకు రాత్రి 23.30 గంటల నుంచి మరునాడు ఉదయం 5.30 గంటల మధ్య ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ పనిచేయదని పేర్కొంది.

ఈ ఆరు గంటల (రాత్రి 23:30 నుంచి ఉదయం 05:30 వరకు) వ్యవధిలో ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌కు సంబంధించి.. టికెట్ రిజర్వేషన్, కరెంట్ బుకింగ్, టికెట్‌ రద్దు, వీటికి సంబంధించిన విచారణ వంటి సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. అయితే PRS సేవలు మినహా ఇతర అన్ని విచారణ సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని వెల్లడించింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.