రాఫెల్‌ డీల్‌పై దర్యాప్తునకు ఆదేశిస్తాం

– మోదీ ఐదేళ్ల కాలంలో బడాపారిశ్రామిక వేత్తలకోసమే పనిచేశాడు
– ఎన్నికల ప్రచారసభలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌
బారాబంకీ, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాఫెల్‌ డీల్‌పై దర్యాప్తునకు ఆదేశిస్తామని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. రాఫెల్‌ యుద్ధవిమానాల డీల్‌కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో సోమవారం జరిగిన ఎన్నికలర్యాలీలో రాహుల్‌ మాట్లాడుతూ..  బీజేపీ నేతలు, ప్రధాని ఇక్కడకు వచ్చి తప్పుడు ప్రసంగాలు చేస్తున్నప్పుడు, ప్రజలు కనీసం ఒక్కసారైనా అనిల్‌ అంబానీకి రూ.30,000 కోట్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించాలని అన్నారు. ఇందుకు ప్రతిగా అనిల్‌ అంబానీ విూకేమిచ్చారని కూడా నిలదీయాలని సూచించారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాఫెల్‌ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతామని చెప్పారు. డిఫెన్స్‌ మంత్రిత్వ శాఖ ఫైల్స్‌లో ఏమి రాసుందనేది దేశ ప్రజలంతా తెలుసుకోవాలనుకుంటున్నారని, అప్పుడు అనిల్‌ అంబానీ, నరేంద్ర మోదీ పేర్లు రెండూ బయటకు వస్తాయని రాహుల్‌ అన్నారు. 15 మంది బడా పారిశ్రామికవేత్తలకు రూ.5,55,000 కోట్ల రుణాలు రద్దు చేశారని, అంటే ప్రజల జేబుల్లోంచి డబ్బులు లాక్కుని మెహుల్‌ చోక్సీ,
నీరవ్‌ మోదీ, విజయ్‌ మాల్యా, లలిత్‌ మోదీ, అనిల్‌ అంబానీకి ఇచ్చారని ఆరోపించారు. అదే రైతులు అడిగితే ఒక్క రూపాయి కూడా రద్దు చేసేందుకు మోదీ ఇష్టపడలేదన్నారు. చౌకీదార్‌నని చెప్పుకుంటున్న మోదీకి రోజంతా అబద్ధాలు చెప్పడమే పనని, ఐదేళ్లుగా ఆయన చేస్తున్నది కూడా అదేనని ఘాటుగా విమర్శించారు. అమేథీని ఈ దేశానికే అతిపెద్ద విద్యా కేంద్రంగా తిర్చిదిద్దుతానని ఆయన భరోసా ఇచ్చారు. 2004 నుంటి అమేథీ నియోజకవర్గానికి రాహుల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమేథి నుంచి ఆయన పోటీ చేస్తుండటం ఇది నాలుగోసారి.