రాఫెల్‌ డీల్‌లో..  దొడ్డిదారిన పీఎంవో జోక్యం చేసుకుంది

– కొత్త ఒప్పందాన్ని మోడీ ఏకపక్షంగా చేసుకొచ్చినట్లుంది
– ‘ద హిందూ’లో సంచలనాత్మక కథనం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి8(జ‌నంసాక్షి) : రాఫెల్‌ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారం ప్రధాని మోడీకి తలనొప్పిగా మారింది.  ఇప్పటికే ఈ డీల్‌పై విపక్షాలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. తాజాగా ‘ద హిందూ’ ఆంగ్ల పత్రికలో సంచలనాత్మక కధనం ప్రచురితమైంది. తాజాగా.. రాఫెల్‌ యుద్ధ విమానాల కోనుగోలు పై ఫ్రెంచ్‌ అధికారులతో సమాంతర చర్చలు జరుపుతుండగా..ఇక్కడ  ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకుందని కధనం ప్రచురించింది. ఈ చర్చల్లో రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ అత్యంతరాలను లేవనెత్తినట్లు తెలిపింది. ప్రధాని కార్యాలయంలో జరిగిన చర్చల్లో భారత్‌ తరుపున రక్షణ శాఖకు సంబంధించిన ఏ అధికారి లేడని తెలిపింది. ఫ్రెంచ్‌ అధికారులతో జరుపుతున్న రాఫెల్‌ డీల్‌ చర్చల్లో రక్షణ శాఖ కీలక అధికారులకు అవకాశం ఇవ్వాలని రక్షణశాఖ సూచించిందని పేర్కొంది. కానీ రాఫెల్‌ యుద్ద విమానాల కొనుగోలు వ్యహరంపై కేంద్రం అక్టోబర్‌ 2018లో సుప్రీంకోర్టుకు తెలిపిన విషయాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయని, రాఫెల్‌ డీల్‌ కు సంబంధించిన చర్చల్లో ఎయిర్‌ స్టాఫ్‌ డిప్యూటీ చీఫ్‌ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం చర్చల్లో పాల్గొన్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపిందని పేర్కొందని, ఈ డీల్‌ లో ప్రధాన మంత్రి కార్యాలయం ఎటువంటి జోక్యం చేసుకోలేదని కోర్టుకు స్పష్టం చేసిందని ఆ పత్రిక ప్రచురింది. 126 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుపై యూపీఏ ఒప్పందాన్ని కాదని, ప్రధాని మోడీ ఏకపక్షంగా 2015 ఏప్రిల్‌ 10న పారిస్‌ పర్యటనలో కొత్త ఒప్పందాన్ని చేసుకొని వచ్చారని, పాత ఒప్పందం రద్దు పక్రియ మార్చి, 2015 నుంచి ప్రారంభించి, 2015 జూన్‌ నాటికి పూర్తి చేసినట్టు మోడీ సర్కార్‌ సుప్రీంకోర్టుకు తెలియజేసిందని ప్రచురింది. అయితే సుప్రీంకోర్టుకు ఇచ్చిన నోట్‌పై తేదీగానీ, సంతకంగానీ లేవని, అధికారిక వివరణ ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం వెనకాడిందని అర్థమౌతోందని, 2015 జూన్‌ 24న అధికారికంగా పాత ఒప్పందం రద్దు అయ్యిందన్న విషయం మన పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ నివేదికలోనూ తెలిపారని తెలిపింది. కానీ, ఇదంతా నిజం కాదని ఫ్రెంచ్‌ సెనేట్‌ పత్రాల ద్వారా తేలిందని, పాత ఒప్పందం రద్దు చేసుకోకుండానే, కొత్త ఒప్పందాన్ని (36 రాఫెల్‌ యుద్ధ విమానాలు) ప్రధాని మోడీ ఏకపక్షంగా చేసుకొచ్చారన్నది స్పష్టమైందని ఆ జాతీయ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం
ఆధారంగా శుక్రవారం రాహుల్‌గాంధీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మోదీతీరుపై నిప్పులు చెరిగారు.