రామకృష్ణాపూర్ కు పూర్వ వైభవం

 

క్యాథనపల్లి మున్సిపాలిటీ ని రామకృష్ణాపుర్ మున్సిపాలిటీ గా అసెంబ్లీ లో తీర్మానం

సంబరాలు జరుపుకుంటున్న తెరాస, పట్టణ శ్రేణులు

అభివృద్ధి పై స్థానికుల ఆశలు

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాతనపల్లి మున్సిపాలిటీ పేరు రామకృష్ణాపూర్ మున్సిపాలిటీగా మార్పునకు సంబంధించిన బిల్లు ఈ రోజు అసెంబ్లీలో పాసవడం ఎంతో ఆనందంగా ఉందని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
సిరుల తల్లి సింగరేణి గర్భం నుంచి ఉద్భవించిన ఊరు రామకృష్ణాపూర్ అని కొనియాడారు.
ఒకప్పుడు ఆర్కే 1, 2, 3, 4, 7,8, ఏరియా వర్క్ షాప్, స్టోర్, టింబర్ యార్డ్, గ్యారేజ్ గనులలో పనిచేసే కార్మికులతో, వారి కుటుంబాలతో రామకృష్ణాపూర్ పట్టణం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా విలసిల్లిందని,
ఈ పట్టణం వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి రాజకీయాలు నడిచేవి అంటే అతిశయోక్తి కాదని, కార్పొరేట్ ని వణికించిన సత్తా ఉన్న లీడర్లు ఈ పట్టణం సొంతం గా ఆయన అభివర్ణించారు.

గతంలో దేదీప్యమానంగా విరిసిన పట్టణం కాలక్రమేణ మూతబడిన గనుల వల్ల రామకృష్ణాపూర్ పట్టణం ప్రాముఖ్యత దిగజారిపోయి, చరిత్ర మసకబారి పోయిందని తెలిపారు.
ఈ క్రమేణా, ప్రాముఖ్యత కోల్పోయిన పట్టణం నుండి రిటైర్డ్ అయిన వలస కార్మికులు సొంత ఊర్లకు తిరిగి వెళ్లడం, మంచిర్యాలకు చేరువలో ఉండాలనే ఉద్దేశంతో మంచిర్యాల, తిమ్మాపూర్, గద్దెరాగాడి, క్యాతనపల్లి వైపు అప్పులు చేసి మరీ ఇల్లు కట్టుకొని స్థిరపడుతున్నారు.
అందుకే నానాటికీ దిగజారుతున్న పట్టణ పరిస్థితిని అర్థం చేసుకొని, ఎంతో గొప్ప చరిత్ర కలిగిన పట్టణానికి పూర్వవైభవం తీసుకురావాలని సంకల్పించామని అన్నారు.

కొత్తగా ఏర్పడిన క్యాతనపల్లి మున్సిపాలిటీ పేరు మార్చి రామకృష్ణాపూర్ మున్సిపాలిటీగా మార్చడం, రామకృష్ణాపూర్ పట్టణం తిరిగి పురుడు పోసుకోవాలన్నదే మా లక్ష్యం గా పేర్కొన్నారు.
ట్టణాన్ని బొందల గడ్డగా మార్చకుండా ఉండాలంటే, వర్తక, వాణిజ్య సంఘాలు తిరిగి పుంజుకోవాలంటే, వలసలు వెళ్లే వారిని ఆపాలంటే, ఆటో సోదరుల పూట గడవాలంటే, చేతి వృత్తులు తిరిగి పుంజుకోవాలంటే, చిరు వ్యాపారుల్లో చిరునవ్వు చిందాలంటే, కుల వృత్తుల వారు ఆర్థికంగా ఎదగాలంటే మన పట్టణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం ఒక్కటే మార్గం గా అభివర్ణించారు.
రామకృష్ణాపూర్ పట్టణం మున్సిపాలిటీగా రూపాంతరం చెందితే పట్టణానికి ఒక గుర్తింపు వస్తుందని. లక్షల రూపాయలు వెచ్చించి, అప్పులు చేసి మరీ వేరే ప్రాంతాలకు వలస వెళ్లే దుస్థితి ఉండదని, వేల రూపాయల అద్దెతో ఇరుకు గదుల్లో ఒదిగిపోయే దౌర్భాగ్యం ఉండదన్నారు.
ఇప్పటికే ఇండ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, తక్కువ ఖర్చు లోనే సొంత ఇంటి నిర్మాణాలు కూడా చేపట్టవచ్చన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు కూడా పూర్తి కావస్తుండడంతో రవాణా వ్యవస్థ కూడా మరింత మెరుగవ్వనుందని తెలిపారు.
పట్టణ సుందరీకరణ, స్మశాన వాటికలు, లైబ్రరీ, మహిళా భవన్, సమీకృత మార్కెట్, కేసీఆర్ పార్క్, మంచిర్యాల ఎక్స్ రోడ్ నుండి రామాలయం చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ, డంపింగ్ యార్డ్, రైల్వే ఓవర్ బ్రిడ్జి, పట్టణం మొత్తం విద్యుత్ లైట్లు, బతుకమ్మ గ్రౌండ్లు, కమ్యూనిటీ భవనాలు పూర్తయితే గొప్ప గొప్ప పట్టణాలను తలదన్నేలా రామకృష్ణాపూర్ అభివృద్ధి చెందుతుందని, తద్వారా పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుందని, సబ్బండ వర్గాల జీవన విధానం మెరుగుపడుతుందని తెలిపారు.
రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పేరు మార్పుతో పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, ఎంతో ఘన చరిత్ర కలిగిన పట్టణం బొందల గడ్డగా మారకుండా పట్టణ అస్తిత్వాన్ని తిరిగి నిలిపిన ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అభినందిస్తున్నారు.
రామకృష్ణాపూర్ పట్టణ మున్సిపాలిటీ బిల్ పాస్ అవడంతో స్థానిక సూపర్ బజార్ ఏరియా లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు, యూనియన్ల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
దీనికి కృషి చేసిన గౌరవ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ జంగం కల, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి , సీనియర్ నాయకులు గార్ల సమ్మయ్య , అబ్దుల్ అజీజ్ , రామిడి కుమార్, యాకుబ్ అలీ , మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, పలు కుల సంఘాల నాయకులు, యూనియన్ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.