రాయబరేలి పీఠంపై ఇక ప్రియాంక

సోనియా స్థానాన్ని భర్తీ చేసేందుకు ఏర్పాట్లు

యూపిలో సవిూకరణాలను తనవైపు తిప్పుకునే యత్నాలు

పావులు కదుపుతున్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌

న్యూఢిల్లీ,జనవరి30(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌లో సోనియా అస్త్రసన్యాసంతో కొత్త శక్తుల పునరేకీకరణకు అవకాశం ఏర్పడబోతోంది. తాను రాజకీయాల నుంచి తప్పుకంటున్నట్లు సోనియా ప్రకటించిన నేపథ్యంలో అనేక మార్పులకు, ఊహాగానాలకు తావేర్పడింది. రాజకీయాలకు కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ దాదాపుగా దూరం అవుతున్నారు. ఆ మేరకు సోనియా గాంధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలనుంచి రిటైర్‌ అయ్యారు.సోనియా రాజకీయాల నుంచి తప్పుకుంటే ఆమె ప్రస్తుతం కొనసాగుతున్న రాయ్‌బరేలీ స్థానం ఎవరి చేతుల్లోకి వెళుతుంది అన్నదే ప్రధాన ప్రశ్నగా చర్చ నడుస్తోంది. అయితే తదుపరి రాయబరేలి ప్రియాంక చేతుల్లోకి వెల్లడం ఖాయంగా కనిపిస్తోంది. రాహుల్‌ను, ప్రియాంకను ఆమె రాజకీయంగా ఉన్నత స్థానాల్లో చూడాలని కోరుకుంటున్నారు. సోనియా గాంధీ మేధస్సు, ఆశీస్సులు పార్టీకి ఎప్పటకీ అవసరమని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. అయితే సోనియా ఆలోచించే తన రాజకీయ రిటైర్మెంట్‌ ప్రకటన చేశారని అంటున్నారు. సోనియా భవిష్యత్‌ కార్యాచరణపై ఓ స్పష్టతతో ఉన్నారని సమాచారం. అందుకే వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రియాంకను తీసుకుని రావడం కోసమే ఆమెను యూపి బాధ్యతలకు పరిమితం చేశారని తెలుస్తోంది. రాహుల్‌ కూడా యూపిలో పట్టుకోసం ఎత్తులు వేస్తున్నారు. అధ్యక్షుడిగా

రాహుల్‌, ఎంపిగా ప్రియాంక ..ఇలా ఇద్దరినీ కాంగ్రెస్‌ వారసత్వ రాజకీయాల్లో ప్రతిష్టింప చేయడం ద్వారా రానున్న సవాళ్లను ఎదుర్కోవాలన్నది సోనియా వ్యూహంగా ఉందన్న ప్రచారం ఉంది. మొట్ట మొదటిసారి రాయ్‌బరేలీలో నాటి కాంగ్రెస్‌ పార్టీ నేత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోటీ చేసి నాటి భారతీయ లోక్‌దల్‌ పార్టీకి చెందిన రాజ్‌ నారాయణ్‌ చేతిలో 1977లో ఓడిపోయారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ అక్కడి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తూనే ఉంది. 1996, 1998లో మాత్రం బీజేపీ రాయ్‌బరేలీలో విజయం సాధించింది. తొలిసారి 1999 కెప్టెన్‌ సతీష్‌ శర్మను బరిలోకి దించి విజయాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఆ తర్వాత ఆ స్థానాన్ని తమకు కంచుకోటగా మార్చుకుంది. 2004లో తొలిసారి సోనియాగాంధీ రాయ్‌బరేలీ బరిలోకి దిగి భారీ విజయం సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి లోక్‌సభ ఎన్నికల్లో ఆమెనే పై చేయి సాధించి రాయ్‌ బరేలీ అంటే కాంగ్రెస్‌కు కంచుకోట అనేట్లుగా మార్చారు. 2014లో కూడా సోనియా విజయం సాధించి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇది కాంగ్రెస్‌కు సేఫ్‌ ప్లేస్‌. ఇక అమేథి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ కూడా జనతా పార్టీకి ఒకసారి, బీజేపీకి ఒకసారి చేజార్చుకున్నప్పటికీ మిగితా అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీనే విజయం సొంతం చేసుకుంది. ఈ రెండు నియోజక వర్గాలు కాంగ్రెస్‌ పార్టీవే అనే ముద్ర వేసుకున్నాయి. ఇప్పుడు సోనియా రాజకీయాల నుంచి తప్పుకుంటే రాయ్‌బరేలీలో బరిలోకి దిగేదెవరు అని ప్రశ్న ఉదయిస్తోంది. సోనియా కుటుంబంలోని వారే దిగితే రాహుల్‌ అమేథి నుంచి ఉన్నారు కాబట్టి ప్రియాంకను బరిలోకి దింపుతారన్నది పరోక్ష సంకేతాలు ఇస్తున్నారు.