రాష్ట్రాభివృద్ధికి స్పీడ్‌ బ్రేకర్‌ మమతనే

– పశ్చిమ బెంగాల్‌ అభివృద్ధికి కేంద్రం అన్నివిధాల సహకరించింది
– భాజపా నాయకులపై దాడులకు దిగుతున్నారు
– దాడులకు ధీటైన సమాధానం చెబుతాం
– ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ
కోల్‌కత్తా ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : పశ్చిమబెంగాల్‌ అభివృద్ధికి ఐదేళ్లలో అన్ని విధాల సహాయక సహకారాలు అందించామని, కానీ రాష్ట్రాభివృద్ధికి ఇక్కడి సీఎం మమత బెనర్జీ స్పీడ్‌ బ్రేకర్‌గా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. దక్షిణ దీనాజ్‌పూర్‌లోని బునియాద్‌పూర్‌లో శనివారం జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.. ఇప్పటికే జరిగిన రెండు విడతల పోలింగ్‌ అనంతరం దీదీకి నిద్ర పట్టడం లేదని వ్యాఖ్యానించారు. టీఎంసీ ఎన్నికల నినాదం మా, మాటీ, మనుష్‌(మాతృమూర్తి, మాతృభూమి, మనుషులు) పేరిట ప్రజల్ని ఆమె మోసం చేస్తున్నారని విమర్శించారు. అలాగే బంగ్లాదేశ్‌ నటులను టీఎంసీ ప్రచారంలో భాగం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మైనారిటీ ఓటర్లను ప్రలోభపెట్టడానికే టీఎంసీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. బాలాకోట్‌ దాడులను ఆధారాలు అడుగుతున్న మమతా.. తొలుత చిట్‌ ఫండ్‌ కుంభకోణం నిందితులను పట్టుకోవాలని సూచించారు. బెంగాల్‌లో భాజపా నాయకులపై జరుగుతున్న దాడులకు దీటైన సమాధానం చెబుతామని మోదీ ఘాటుగా వ్యాఖ్యానించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలు తప్పవన్నారు. ప్రజల నమ్మకాన్ని ఆమె తుంగలో తొక్కి, ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. నేను ప్రధాన మంత్రి పదవిని చేపట్టడానికి ముందు నేను కూడా ఆమె నిరాడంబరతకు నిలువుటద్దమని అనుకున్నానని, అయితే నేను ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఆమె గురించి ఎక్కువగా తెలుసుకున్నానని అన్నారు. బెంగాల్‌లో ఆమె ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని మోదీ విమర్శించారు. ఏప్రిల్‌ 23న మూడో దశ ఎన్నికలు ప్రారంభమవనున్న తరుణంలో మోదీ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో రెండు ఎంపీ సీట్లు సాధించిన భాజపా.. ఈసారి ఎలాగైనా 23 సీట్లలో విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.