రాహుల్‌కు నిరసన సెగ

– సొంత నియోజకవర్గంలో నిలదీసిన రైతులు
– ‘రాహుల్‌ ఇటలీకి వెళ్లిపోవాలి’ అంటూ డిమాండ్‌
అమేథీ, జనవరి24(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. అమేథీ పర్యటనకు వచ్చిన రాహుల్‌కు వ్యతిరేకంగా అక్కడి రైతులు ఆందోళన చేపట్టారు. ‘రాహుల్‌ ఇటలీకి వెళ్లిపోవాలి’ అంటూ డిమాండ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండురోజుల పర్యటన నిమిత్తం రాహుల్‌  తన సొంత నియోజకవర్గమైన అమేథీకి వచ్చారు. అయితే రాహుల్‌ పర్యటనను నిరసిస్తూ గౌరీగంజ్‌ ప్రాంతంలోని రైతులు ఆందోళన చేపట్టారు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌ తమ భూములను లాక్కొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగాలు కల్పించాలని లేదా భూములు వాపస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ తీరుపై మేం అసహనంగా ఉన్నామన్నారు. ఆయన మా భూములను లాక్కొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఇక్కడ ఉండే అర్హత లేదంటూ, రాహుల్‌ తిరిగి ఇటలీ వెళ్లిపోవాలి’ అని ఆందోళనకారులు నినాదాలు చేశారు. 1980ల్లో కౌసర్‌ ప్రాంతంలో సామ్రాట్‌ సైకిల్‌ ఫ్యాక్టరీని ఏర్పాటుచేసేందుకు వ్యాపారవేత్తలు 65.57ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. అప్పట్లో ఈ ఫ్యాక్టరీని అమేథీ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న రాజీవ్‌గాంధీ ప్రారంభించారు. అయితే ఆ తర్వాత అప్పుల పాలైన ఆ వ్యాపారవేత్తలు లీజు చెల్లించలేని పరిస్థితిని దిగజారారు. కంపెనీని కూడా మూసేశారు. దీంతో బాకీ వసూలు చేసేందుకు యూపీ పరిశ్రమల అభివృద్ధి సంస్థ 2014లో ఈ భూమిని వేలం వేసింది. వేలంలో ఈ భూమిని రాజీవ్‌గాంధీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ కొనుగోలు చేసింది. అయితే కొంతకాలానికి ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో ఈ వేలం చెల్లదని గౌరీగంజ్‌ కోర్టు స్పష్టం చేసింది. భూమిని తిరిగి యూపీ పరిశ్రమల అభివృద్ధి సంస్థకు ఇవ్వాలని ఆదేశించింది. కానీ ఇప్పటికీ ఆ భూమి రాజీవ్‌ గాంధీ ట్రస్టు చేతుల్లోనే ఉంది. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.