‘రాహుల్‌ మేడిన్‌ ఇటలీ’

– పటేల్‌ విగ్రహం గురించి రాహుల్‌ వ్యాఖ్యలు అర్థరహితం
– దేశంలో వృథాగాపడిఉన్న ఇనుమును సేకరించి విగ్రహంలో వాడుతున్నాం
– గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌
గాంధీనగర్‌, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ) : రాహుల్‌లో ప్రవహిస్తుంది ఇటలీ రక్తమని, ఆయన ‘మేడిన్‌ ఇటలీ’ అంటూ గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ ఎద్దేవా చేశారు. ఆయన పటేల్‌ విగ్రహం గురించి వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం గురించి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన మేడిన్‌ చైనా వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈసందర్భంగా శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ పూర్తిగా మేడిన్‌ ఇండియా, గుజరాత్‌. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిల్డర్లను బిడ్డింగ్‌ కోసం ఆహ్వానించామని తెలిపారు. అయితే ఆ కాంట్రాక్టు ఎల్‌ అండ్‌ టీకి దక్కిందని, ఎల్‌ అండ్‌ టీ భారత కంపెనీనే కదా అని నితిన్‌ పటేల్‌ అన్నారు. ఈవిగ్రహ నిర్మాణం కోసం 1,700 టన్నుల కాంస్యాన్ని మాత్రమే చైనా నుంచి తీసుకువచ్చామన్నారు.
70,000 టన్నుల ఇనుము, 18,500 టన్నుల స్టీల్‌ భారత్‌లోదే. దేశవ్యాప్తంగా వృథాగా పడి ఉన్న ఇనుమును రైతుల నుంచి స్వీకరించి ఇందులో వాడాం అని ఆయన దాని గురించి వివరించారు. రాహుల్‌ వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారని, భారత ప్రజలు ముఖ్యంగా గుజరాతీల మనోభావాలను ఆయన అవహేళన చేస్తున్నారని విమర్శించారు. రాహుల్‌ గాంధీ శరీరంలో ఇటాలియన్‌ రక్తం ప్రవహిస్తోందని, ఆయన మేడిన్‌ ఇటలీ’ అని నితిన్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ సర్దార్‌ సాధించిన ఖ్యాతిని తుడిచేందుకు ప్రయత్నిస్తోందన్నారు. భారత స్వాతంత్య ఘనతను కేవలం నెహ్రూ-గాంధీ కుటుంబానికే చెందాలని తాపత్రయపడుతున్నారని నితిన్‌ పటేల్‌ మండిపడ్డారు. గుజరాత్‌లో స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ పేరుతో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ విగ్రహాన్ని’మేడిన్‌ చైనా’ అంటూ గురువారం రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాహుల్‌పై గుజరాత్‌ డిప్యూటీ సీఎం ఫైర్‌ అయ్యారు.