రాహుల్‌ రావణుడు, ప్రియాంక శూర్పణక

– కాంగ్రెస్‌ మునిగిపోయే నావలాంటిది
– బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో, జనవరి30(జ‌నంసాక్షి) : ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీపై బీజేపీ నేతల విమర్శల పర్వం కొనసాగుతోంది. ఇటీవల ప్రియాంకకు యూపీ తూర్పు కాంగ్రెస్‌ విభాగం బాధ్యతలు అప్పగించడంతో ఆమెపై బీజేపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికలంటే అందాలు పోటీలు కాదంటూ ప్రియాంకను ఉద్దేశించి రెండు రోజుల కిందట బిహార్‌ డిప్యూటీ సీఎం, బీజేపీ నేత సుశీల్‌ మోదీ చేసిన వ్యాఖ్యాలపై పెనుదుమారమే రేగింది. తాజాగా యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రియాంకను శూర్పణఖతో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, మోదీని శ్రీరాముడు, రాహుల్‌ను రావణాసురుడితో పోలుస్తూ ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ చట్టం వివాదం కారణంగానే ఇటీవల జరిగిన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్‌ ఓడించగలిగిందని ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ కు ఓ రాజకీయ విధానం అంటూ ఏదీ లేదని, వచ్చే ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ గెలవబోదని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోయే నావలాంటిదని ఎద్దేవా చేశారు. అంతేకాదు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ
రావణాసురుడైతే, ఆయన సోదరి ప్రియాంకా గాంధీ శూర్పణఖ లాంటి వారని సురేంద్ర సింగ్‌ విమర్శించారు. రాముడితో యుద్ధం చేయడానికి ముందు రావణుడు తొలుత తన సోదరి శూర్పణఖను పంపాడని… ఇప్పుడు రాహుల్‌ కూడా మోదీని ఎదుర్కొడానికి శూర్పణఖ లాంటి ప్రియాంకను బరిలో నిలిపారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, బీఎస్పీ అధినేత్రి మాయావతిని ట్రాన్స్‌ జెండర్‌గా అభివర్ణిస్తూ తమ ఎమ్మెల్యే సాధనాసింగ్‌ చేసిన వ్యాఖ్యలను సైతం సురేంద్ర సింగ్‌ సమర్థించడం విశేషం. ఆత్మగౌరవం లేనివారిని ట్రాన్స్‌ జెండర్‌ అంటారని… సమాజ్‌ వాదీ పార్టీతో జతకట్టడం ద్వారా తనకు ఆత్మగౌరవం లేదని మాయావతి నిరూపించుకున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో యూపీలో గెలిచే సీట్లు అన్ని పార్టీలకూ కీలకం కావడంతో ముఖ్యంగా అధికార బీజేపీకి ఇది జీవన్మరణ సమస్యగా పరిణమించింది. ఎస్పీ-బీఎస్పీలు కూటమిగా ఏర్పడటం, ప్రియాంకకు యూపీ తూర్పు బాధ్యతలను కాంగ్రెస్‌ అప్పగించడంతో కమలునాథులకు కొంత ఇబ్బందికరంగా మారింది. దీంతో మాటల యుద్ధానికి తెరతీశారు.