రిజర్వేషన్లు ఆధారంగా…

పదోన్నతులు చేపట్టొద్దు
-సంచలన తీర్పు వెలువరించిన సుప్రింకోర్టు
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : పదోన్నతుల్లో రిజర్వేషన్‌కు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పును వెలువరించింది. రిజర్వేషన్లు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాదు, రిజర్వేషన్ల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతలు కల్పించడంపై 2006లో నాగరాజు కేసులో ఇచ్చిన తీర్పును సవిూక్షించాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, ఈ కేసును ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి కూడా బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఎస్సీ, ఎస్టీ జనాభాను పరిగణనలోకి తీసుకుని పదోన్నతుల్లో రిజర్వేషన్లకు అనుమతించాలన్న కేంద్రం విఙ్ఞాపనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రానేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తిరస్కరించింది.
పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలు రిజర్వేషన్‌ ఫలాలు అనుభవించేందుకు కొన్ని షరతులు విధిస్తూ నాగరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై 2006లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కొన్నిరోజుల క్రితం సుప్రీంలో పిటిషన్‌ దాఖలైంది. దీన్ని విచారించిన జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. నాగరాజు కేసులో ఎలాంటి సవిూక్షలు చేపట్టాల్సిన అవసరం లేదని ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన తీర్పును పునఃసవిూక్షించాలని, దీనిపై ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏర్పాటుచేయాలని పిటిషనర్‌ కోరగా, ఆ అవసరం లేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. నాగరాజు కేసులో అసంబద్ధమైన షరతులు ఉన్నాయని, పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల ఫలాలు అందకుండా చేస్తున్నాయని కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ బలమైన వాదనలు వినిపించారు. ఎస్సీ, ఎస్టీలు చాలా కాలంగా కుల వివక్షతను ఎదుర్కొంటున్నారని, పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లు వర్తింపజేస్తే వారికి మేలు జరుగుతుంది వాదించారు.
అయితే, అంతకు ముందు కోటాను వ్యతిరేకిస్తూ సీనియర్‌ న్యాయవాది రాకేశ్‌ ద్వివేది వాదనలు వినిపిస్తూ.. షెడ్యూల్‌ కులాలు, తెగల వెనుకుబాటుతనం గురించి ఊహించుకుంటున్నారని తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీలు ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన తర్వాత వారికి రిజర్వేషన్లు వర్తించవని అన్నారు. అలాగే కేటగిరీ 3, 4 విభాగాల్లో బహుశా రిజర్వేషన్లు పాటించవచ్చు గానీ, ఉన్నతస్థాయి సర్వీసులకు ఆ అవసరంలేదని పేర్కొన్నారు.