రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు మృతి
గోదావరిఖని,జులై8(జనంసాక్షి):గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతన కాలనీ కోల్‌కారిడార్ రెడ్డి కాలనీలో రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందగా, తల్లీ కొడుకు పరిస్థితి విషమంగా మారింది. టూటౌన్ సీఐ గాండ్ల వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. పోతన కాలనీకి చెందిన కాదాసి ఎల్లయ్య బైక్‌పై తన స్వగ్రామం జనగామకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. అదే కాలనీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి సతీమణి అంజలి తన ఇద్దరు కొడుకులు నిఖిల్, శ్యాంలను తీసుకొని స్కూటిపై గోదావరిఖనికి వెళుతున్నది. ఈ క్రమంలో కోల్ కారిడార్ రోడ్డు రెడ్డి కాలనీ వద్ద ఎల్లయ్య బైక్ అతి వేగంగా ఎదురుగా వస్తున్న స్కూటిని ఢీకొంది. దీంతో ఒక్కసారి రెండు బైక్‌లపై ఉన్న నలుగురు ఎగిరిపడ్డారు. ఎల్లయ్య(57), నిఖిల్ (12)కు తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడమే మృతిచెందగా, అంజలి, శ్యామ్‌కు తీవ్రగాయాలు కావడంతో గోదావరిఖని ప్రైవేటు దవాఖానకు తరలించారు. వారిద్దరు కోమాలోకి వెళ్లారనీ, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పినట్లు సీఐ వివరించారు. ఎల్లయ్య అజాగ్రత్తగా, అతి వేగంగా వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ చేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు తెలిపారు.