రెవెన్యూ శాఖ అత్యుత్సాహం
అటవీ భూములకు పట్టాలు
విద్యుత్ శాఖ ఉచిత విద్యుత్ సౌకర్యం
భూముల స్వాధీనం కోసం మేల్కొన్న అటవీశాఖ
వరంగల్,జూలై18(జనం సాక్షి): రెవెన్యూ అధికారుల మాయ కారణంగా అటవీభూములకు పట్టాలు వచ్చాయి. వారికి రైతుబంధు పథకం అందింది. విద్యుత్ అధికారుల కారణంగా విద్యుత్ అందుతోంది. ఇదంతా పోడు భూములకుకాదు. అడవుల్లో ఉన్న భూముకలు కూడా జరిగిపోయింది. ఇలాంటి వాటిని గుర్తించిన అటవీశాఖ రంగంలోకి దిగింది. అటవీశాఖలోని కొందరు అధికారుల నిఘా కొరవడటం, నిర్లక్ష్యం, అక్రమాల వల్ల జిల్లాలో క్రమేనా అటవీ విస్తీర్ణం తగ్గిపోతుంది. ఇప్పటికే అడవులు తరిగిపోయాయి. గతంలో దట్టమైనవిగా చెప్పుకున్న అడవులు సైతం చిట్టడవులుగా మారుతున్నాయి. పోడు పేరుతో ఆక్రమణదారులు అటవీ భూములను కబ్జా చేస్తున్నారు. చెట్లను నరికి పొదలను కాలబెడుతున్నారు. ఆక్రమణదారుల్లో కొందరు కూలీలతో అడవిలోని చెట్లను నరికించి అటవీ భూములను తమ వ శం చేసుకుంటున్నారు. పంట పెట్టుబడి కోసం ప్రతీ సంవత్సరం రెండు విడత ల్లో ఎకరానికి రూ.8వేల లెక్కన రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడా ది రైతుబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో అటవీ భూములకు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్‌బుక్కులు జారీ చేసిన ఉదంతాలు కొ న్ని వెలుగుచూశాయి. ఇప్పటికీ చెట్లతో ఉన్న, పోడు పేరుతో చెట్లను నరకడం మొదలుకాని అటవీ భూములకూ రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్‌బుక్కులు ఇచ్చిన వైనం కూడా బయటపడింది. పోడు పేరుతో కొందరు ఆక్రమించుకున్న అటవీ భూముల్లో పంటల సాగుకోసం ఎన్పీడీసీఎల్ అధికారులు విద్యుత్ వసతి కల్పించారు. 24 గంటల నాణ్యమైన ఉచిత కరంటు సరఫరా జరుగుతుండటంతో ఆక్రమణ
దారులు అటవీ భూముల్లో దర్జాగా పంటలు సాగుచేస్తున్నారు. దీంతో ఆక్రమిత అటవీ భూములను తిరిగి తమ ఆధీనంలోకి తీసుకోవాలని అటవీశాఖ నిర్ణయించింది. ఈ మేరకు దశల వారీగా ముందుకు వెళుతున్నారు. తొలి విడత ఆక్రమిత అటవీ భూ ములకు బ్యాంకర్స్ రుణాలు, ఎన్పీడీసీఎల్ అధికారులు విద్యు త్ కనెక్షన్ ఇవ్వకుండా అడ్డుకోవటానికి అటవీశాఖ అధికారులు శ్రీకారం చుట్టారు. ఆక్రమిత అటవీ భూముల వివరాలతో బ్యాంకర్స్, ఎన్పీడీసీఎల్కు లేఖలు రాస్తున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు ప్రభుత్వ సర్వే నంబర్లపై అటవీ భూములకు పట్టాదారు పాస్‌బుక్కులు అందజేసిన నేపథ్యంలో అటవీశాఖ అధికారులు తొలిసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విశేషం. కబ్జా చేసిన అటవీ భూములను ఆక్రమణదారులు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. అవకాశం ఉంటే రెవెన్యూ అధికారుల సాయంతో ఆక్రమిత అటవీ భూములకు పట్టాదారు పాస్‌బుక్కులను కూడా పొందుతున్నారు. పెద్ద ఎత్తున అటవీ భూములు ఆక్రమణకు గురైన గ్రామాలను గుర్తించి ఆక్రమణదారుల చెరనుంచి ఆక్రమిత అటవీ భూములను తమ ఆధీనంలోకి తీసుకోవటానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ భూమి పక్కన ఆక్రమణకు గురైన కొన్ని వందల ఎకరాలకు రెవెన్యూ అధికారులు పాస్‌బుక్కులు ఇచ్చారు. వందల ఎకరాల అటవీ భూములకు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్‌బుక్కులు ఇచ్చినట్లు అటవీ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. రెవెన్యూ అధికారులు పట్టాదారు పాస్‌బుక్కులు ఇవ్వటంపై నివేదిక రూపొందించి కొద్ది రోజుల క్రితం ప్రభుత్వానికి పంపినట్లు అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ భూముల సర్వే నంబర్లతో రెవెన్యూ అధికారులు జారీచేసిన పట్టాదారు పాస్‌బుక్కులు
గల రైతులకు రుణాలు ఇవ్వొద్దని అటవీశాఖ ఉన్నతాధికారులు తమశాఖ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా చేస్తుండటం వల్ల పోడు వ్యవసాయం పెరుగుతున్నందున ఆక్రమిత అటవీ భూముల్లో విద్యుత్ లైన్లు వేయవద్దని, కరెంటు కనెక్షన్ ఇవ్వొద్దని ఎన్పీడీసీఎల్కు కూడా లేఖలు పంపాలని తెలిపారు.