రైతును రాజు చేసింది మోదీ సర్కారే
– వరి మద్దతు ధర పెంపుతో రైతులు సంతోషంగా ఉన్నారు
– బాణసంచా పేలుడులో మృతులకు రూ.10లక్షల పరిహారం అందించాలి
– కత్తిమహేష్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
భూపాలపల్లి, జులై5(జనం సాక్షి) : దేశంలో రైతును రాజును చేసిన ఘనత మోదీకే దక్కిందని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం ఆయన విూడియాతో మాట్లాడారు. వరికి మద్దతు ధర పెంచడంతో ప్రజలు సంతోషిస్తున్నారని.. నరేంద్ర మోదీ ఇప్పుడు రైతు మోదీగా మారిపోయారని అన్నారు. మద్దతు ధర పెంచుతూ మోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు. ఇంత కాలం జై జవాన్, జై కిసాన్ అనేవి నినాదాలుగా మాత్రమే ఉండేవని.. కానీ మోదీ నేడు దాన్ని నిజం చేసి చూపించారన్నారు. భాజపా ప్రభుత్వం రైతుల మోములో చిరునవ్వులు చూడాలని కోరుకుంటోందని లక్ష్మణ్ అన్నారు. తెరాస ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి 4 వేలు ఇస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచడం ద్వారా ఎకరానికి రూ.10-15 వేల వరకు లాభాలు వచ్చేలా చర్యలు తీసుకుందన్నారు. వరంగల్ జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు లక్ష్మణ్ సంతాపం తెలిపారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని.. వరంగల్ నడిబొడ్డున బాణసంచా అక్రమంగా తయారుచేస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తన శాఖల పనితీరు పట్ల పట్టు కోల్పోయిందని విమర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులను ప్రభుత్వం ఓటుబ్యాంకుగా మాత్రమే చూస్తోందని లక్ష్మణ్ విమర్శించారు. కొట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై కత్తి మహేష్ కించపరిచే వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం మతం, కులం కోణంలో చూస్తే ఉరుకునేది లేదని.. అవసరమైతే చట్టాన్ని సవరించైనా సరే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.