రైతును రాజు చేసే గొప్ప పథకం

ఊరూవాడా చెక్కుల సంబరం 
జనగామ,మే16(జ‌నం సాక్షి): రైతును రాజు చేసే గొప్ప పథకం రైతుబంధు పథకం అని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. గ్రామాల్లో వారం రోజులుగా చెక్కుల జాతర సాగుతోందన్నారు. దీంతో రైతుల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టాదారు పాస్‌ పుస్తకాలు, పంటపెట్టుబడి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొంటున్నారు.
రైతులకు పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు, పంటపెట్టుబడి చెక్కులను పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతును రాజు చేయడం కోసమే సీఎం కేసీఆర్‌ రైతుబంధు పథకం అమలు చేస్తున్నారని అన్నారు. రైతులు ఆనందంతో చెక్కులను, పాస్‌ పుస్తకాలను తీసుకొని మురిసిపోయారు. జై కేసీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. ఆయా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.  రైతులకు తాగునీటికి ఇబ్బందులు రాకుండా  గ్రామాలకు తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు. రైతును రారాజును చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం రైతులకు భరోసా అని ఎర్రబెల్లి అన్నారు.  70 ఏళ్ల సీమాంధ్ర పాలనలో ఈరోజుకు కూడా రైతు శ్రేయస్సు కోసం రైతుకు ఏ ప్రభుత్వాలు కూడా రూ.10 అందించిన దాఖలాలు లేవని అన్నారు.  రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి రైతుల సంక్షేమం కోసం కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ, ఎరువులు, విత్తనాల కొరత లేకుండా రైతులకు అందించడంతో పాటు 2008 నుంచి 2013 వరకు ప్రకృతి వైఫరిత్యాల వల్ల నష్టపోయిన రైతులకు రూ.480 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని రైతులకు అందించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అన్నారు.
రైతుల కోసం అనేక పథకాలకు శ్రీకారం చుడుతూ ఆత్మహత్యలు లేని తెలంగాణ నిర్మాణం కోసం సీఎం పాటు పడుతున్నారన్నారు. రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్‌ అందించడంతో పాటు తెలంగాణలోని బీడు భూములను సాగు భూములుగా మార్చడంతో పాటు తెలంగాణను అన్నపూర్ణగా మార్చే దిశగా సీఎం ముందుకు వెళుతున్నారన్నారు.