రైతుబందుతో పాటు ఇక 5లక్షల బీమా

తెలంగాణలో అన్నదాతలకు అండగా కెసిఆర్‌
దేశ చరిత్రలోనే నూతన అధ్యాయం అన్న కడియం శ్రీహరి
వరంగల్‌,మే14(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన రైతుబంధు పథకం దేశ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. దీంతో రైతులను ఆదుకునే విధంగా పథకం రూపొందిందని అన్నారు. దీంతోపాటు త్వరలోనే రైతుకు 5లక్షల పంటల బీమా పథకం అందించబోతున్నామని అన్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సతీష్‌ తో కలిసి పర్యటించిన ఆయన, రైతుబంధు పథకం లబ్దిదారులకు పాస్‌ పుస్తకాలు, చెక్కులను పంపిణీ చేశారు. అన్నదాతల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేసే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో రైతుబంధు పథకం ఓ అద్భుతమని.. దేశమంతా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక కష్టాలు, అవమానాలు పడి సాధించుకున్నాం.. ఇప్పుడు ఇష్టపడి అభివృద్ధి చేసుకుందామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని, ఆయనకు మనమందరం అండగా ఉండాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కృషి చేస్తున్నారన్నారు. సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందించడంతో పాటు పెట్టుబడి సాయం కింద ఎకరాలకు రూ. 4వేల చొప్పున ఇస్తున్నారని చెప్పారు. పండించిన ధాన్యాన్ని సరైన ధర వచ్చినప్పుడే అమ్మడానికి వీలుగా ప్రతి మండలంలో  5వేల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదామలు ఏర్పాటు చేశామన్నారు. సాగునీటి ఇబ్బందులు రాకుండా రిజర్వాయర్లు నిర్మిస్తున్నామని సూచించారు. గత ప్రభుత్వాలు రైతల నుంచి నీటి తీరువా, భూమిశిస్తు వసూలు చేస్తే తమ సర్కారు శిస్తు మాఫీ చేసి, పెట్టుబడి సాయం అందిస్తుందన్నారు. రైతుబంధు, పహాణీ శుద్దీకరణ పథకాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్‌ 24 గంటల ఉచిత కరెంట్‌, సాగునీరు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలతో పాటు ఇప్పుడు రైతుబంధు పథకం ద్వారా రైతన్నల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సతీష్‌ తెలిపారు. వ్యవసాయమంటే దండుగ కాదని పండుగలా చేసేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని  అన్నారు. అన్నదాతను సుఖంగా ఉంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రైతులకు అడగకుండానే అన్ని వరాలు కేసీఆర్‌ ఇస్తున్నాడని అన్నారు. మద్దతు ధర పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు కోరినా ఫలితం లేకపోయిందన్నారు. ముఖ్యమంత్రి మద్దతు ధర పెంపునకు కృషి చేస్తున్నారని, త్వరలోనే రైతులకు మరింత మద్దతు ధర అందుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.