రైతుబంధుతో ప్రతిపక్షాల్లో భయంపట్టుకుంది

– డిప్యూటీ సీఎం, విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి
వరంగల్‌ అర్బన్‌, మే18(జ‌నం సాక్షి ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం.. కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ పార్టీలకు భయం పుట్టిస్తుందని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం జిల్లాలోని కాజీపేట మండలం సోమిడి గ్రామంలో అర్హులైన రైతులకు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు, రైతుబంధు చెక్కులను కడియం శ్రీహరి అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఈ నెల 10 వ తేదీ నుంచి నేటి వరకు జరిగిన రైతు బంధు కార్యక్రమంలో చిన్న అపశ్రుతి కూడా జరగలేదన్నారు. ఇది కేవలం రైతు కార్యక్రమంగా జరిగింది.. రాజకీయ వేదికలుగా దీనిని వాడుకోలేదని స్పష్టం చేశారు. రైతుబంధు అమలు జరుగుతున్న తీరు చూస్తుంటే ఇతర రాజకీయ పార్టీలకు భయం అవుతుందన్నారు. కానీ బయటకు విమర్శలు చేయలేని పరిస్థితి అన్నారు. ఇష్టం ఉన్నా, లేకపోయినా సహకరించాల్సి వస్తుందన్నారు. ఏడాది కాలంగా అధికారులు, సిబ్బంది కష్టపడి భూవివాదాలు లేకుండా రికార్డులు తయారు చేశారు. అందుకే ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతుందన్నారు. ఇందుకోసం కష్టపడిన ఉద్యోగులందరికి కడియం శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు. రైతు పాస్‌ బుక్కును పాస్‌ పోర్ట్‌ అంత అందంగా రూపొందించారు. దీన్ని భద్రంగా ఉంచుకోవాలి. వ్యవసాయానికి ఇచ్చిన పెట్టుబడిని వ్యవసాయానికే ఉపయోగించాలని రైతులకు కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌, మేయర్‌ నన్నపనేని నరేందర్‌, రాష్ట్ర మహిళా ఆర్ధిక సంస్థ చైర్‌ పర్సన్‌ గుండు సుధారాణి, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, కలెక్టర్‌ ఆమ్రపాలి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షురాలు లలితా యాదవ్‌, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.