రైతుబంధు కోసం ముమ్మర ఏర్పాట్లు

గ్రామాల్లో మొదలైన ప్రచారం
వరంగల్‌,మే8(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న రైతు బంధుపథకంలో భాగంగా.. ఈనెల 10నుంచి జిల్లాలో ఎకరాకు రూ.4వేల చొప్పున పంట సాగు కోసం నగదు సాయం పంపిణీ చేయనుంది. ప్రతి ఏటా వానా కాలం, యాసంగి పంటల సాగు కోసం రూ.8వేల చొప్పున సాయం అందించనుండగా.. ఇందుకోసం ఇప్పటికే ఉమ్మడి జిల్లా స్థాయిలో రైతు సమన్వయ సమితి సభ్యులతో డిప్యూటి సిఎం కడియం శ్రీహరి సవిూక్షించారు. ఆయన ప్రత్యేకంగా శ్రద్దతీసుకుని దీనికోసం ఏర్పాట్లు చేస్తున్నారు.  అన్నదాతలకు చెక్కుఉల అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేపడుతోంది. జిల్లాలో అన్ని గ్రామాల పరిధిలోని రైతులకు ఈ నెల 10 నుంచి చెక్కుల పంపిణీ జరగనుంది.  వారంరోజుల పాటు చెక్కుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ పక్రియను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు శాఖలతోపాటు పలు ఇతర శాఖలతోనూ సమన్వయంతో ముందుకు సాగుతోంది. ప్రత్యేక బృందాల ద్వారా ఒక రోజు ముందే సమాచారం చేరవేయనున్నారు. గ్రామ స్థాయి బృందాల్లో ఏఈఓ, వీఆర్‌ఓ,
వీఆర్‌ఏతోపాటు గ్రామ రైతు సమన్వయ సమితుల కో ఆర్డినేటర్లు ఉండగా.. మండల బృందంలో వ్యవసాయ శాఖ అధికారి, తహసీల్దార్‌, హార్టికల్చర్‌ అధికారితోపాటు పోలీస్‌ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ ఉంటారు. ఈ బృందాలను జిల్లా స్థాయిలో ఉండే జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా స్థాయి బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. ఒక గ్రామంలో ఒకే రోజులో ఈ కార్యక్రమం పూర్తి చేస్తారు. ఆర్డర్‌ చెక్కుల రూపంలో రైతులకు అందే సాయంను నగదుగా మార్చుకోవడానికి రైతులు ఎంపిక చేసిన  43 బ్యాంకు శాఖలను వినియోగించుకోవాల్సి ఉంటుంది. పోలీస్‌ బందోబస్తు నడుమ బ్యాంకుల వద్ద చెక్కుల మార్పిడి జరగనుంది. పట్టాదార్‌ పాస్‌ పుస్తకంతోపాటు ఆధార్‌ లేదా గుర్తింపు కార్డుతో రైతులు హాజరు కావాల్సి ఉంటుంది.