రైతుబంధు చెక్కుల కాలపరిమితి మూడు నెలలు

ఎప్పుడైనా తీసుకోవచ్చన్న బ్యాంకర్లు
జనగామ,మే8(జ‌నం సాక్షి): రైతుబంధు చెక్కుల కాల పరిమితి మూడు నెలలు ఉంటుందని బ్యాంకర్లు చెప్పారు. చెక్కులు అందుకున్న  రైతులు ఈ కాలంలో ఎప్పుడైనా డబ్బులు డ్రా చేసుకోవచ్చన్నారు.  అలాగే బ్యాంక్‌లకు వచ్చే ముందు పట్టాదారు పాస్‌బుక్‌ మొదటి పేజీ జిరాక్స్‌ కాపీ, ఒరిజినల్‌ ఆధార్‌ కార్డుతో పాటు ఆధార్‌ జిరాక్స్‌ కాపీని కూడా వెంట తీసుకరావాలని  బ్యాంకర్లు చెప్పారు. ఇదిలావుంటే
రైతుబంధు పథకంలో రైతులకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకు అధికారులు అన్ని విధాలుగా సహరించాలని జిల్లా కలెక్టర్‌ టీ వినయ్‌కృష్ణా రెడ్డి అన్నారు. రైతుబంధు పథకం చెక్కుల పంపిణీపై జిల్లాలోని సంబంధిత బ్యాంకుల మేనేజర్లు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌లతోపాటు పోలీసు, వైద్యసిబ్బందికు సూచనలు చేశారు. రైతుబంధు పథకం చెక్కుల విషయంలో రైతులకు ఇబ్బందులు ఏర్పడకుండా బ్యాంకుల్లో అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాలని బ్యాంక్‌ అధికారులకు సూచించారు. అలాగే చెక్కుల పంపిణీ కేంద్రాలలో పోలీస్‌ బందోబస్తుతో పాటు ప్రైమరీ హెల్త్‌ వర్కర్‌లు, ఏఎన్‌ఎంలు, రైతులకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందించాల్సిందిగా కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ఇకపోతే ఈనెల 10 నుంచి 17వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు బంధు చెక్కుల పంపిణీ, రైతు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల జారీ పక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ టీ వినయ్‌కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తహసీల్దార్లపై ఉందన్నారు. రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమ వివరాలు, వేదిక, సమయాన్ని గ్రామస్తులకు ముందుగానే తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం ఒక యజ్ఞంలా నిర్వహించాలని, ప్రతీ 300 మందికి ఒక్క టీంగా ఏర్పడి రైతులకు అర్థమయ్యే విధంగా సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాకు ఐదు బ్యాంకులకు చెక్కుల పంపిణీ అధికారం ఇచ్చారని, చెక్కులు పంపిణీ చేసిన తర్వాత డబ్బు విడుదల అయ్యే వరకు అధికారులు రైతులకు సహకరించాలన్నారు. ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయాన్ని బ్యాంకులు వేరే ఖాతాలకు ఉపయోగించవద్దని, బ్యాంకు వచ్చిన రైతుకు నగదు లేదని తిప్పి పంపించకుండా చూడాలన్నారు.
—–