రైతు సంక్షేమం లక్ష్యంగా మోడీ సర్కార్ కృషి: మురళీధర్‌రావు
జయశంకర్ భూపాలపల్లి,సెప్టెంబర్8(జనంసాక్షి): రైతుల ఆనందమే బిజెసి లక్ష్యమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతు సంక్షేమం లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. జిల్లాలోని రేగొండ మండల కేంద్రంలో శుక్రవారం భాజపా జిల్లా అధ్యక్షుడు వెన్నంపల్లి పాపయ్య అధ్యక్షతన తాగునీటిపై రైతు పంచాయితీ సభ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మురళీధరరావు, భాజపా కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని సుగుణాకరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మురళీధర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే పంటలు పండించిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్‌బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
జయశంకర్ జిల్లా పొడవునా గోదావరి నది ఉన్నా రైతులు మాత్రం సాగునీటికి నోచుకోవటం లేదన్నారు. కాళేశ్వరం వద్ద కడుతున్న మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి సాగునీరు జయశంకర్ జిల్లా రైతులకు కాకుండా సిద్దిపేట, హైదరాబాద్‌కు తరలించటం సరికాదన్నారు. ముందుగా జయశంకర్ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చిన తర్వాతే ఇతర జిల్లాలకు తరలించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌తో పాటు జాతీయ, రాష్ట్ర, జిల్లా నేతలు మధుసూదనరెడ్డి, వేణుగోపాలరెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, కీర్తిరెడ్డితో పాటు సుమారు 2వేల మంది కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.