రైతు సంక్షేమమే సిఎం కెసిఆర్‌ లక్ష్యం

వరంగల్‌,జూన్‌12(జ‌నం సాక్షి): రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ నిరంతరంగా పాటుపడుతున్నారని ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ అన్నారు. వ్యవసాయ మార్కెట్‌లో రిజర్వేషన్ల వల్ల మహిళలకు అవకాశం వచ్చిందన్నారు. ఎంత ధాన్యాయినా కొనుగోలు చేసేందుకు ఆదేశాలు ఇవ్వడంతో ఇక కొనుగోళ్ల సమస్య రానద్నారు. యాసంగిలో కొన్న ధాన్యానికి వెంటనే డబ్బు చెల్లించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన ఆదేశాలు అమలుకావడంతో చేతుల్లో పెట్టుబడితో రైతులు ధీమాగా ఉన్నారు. ప్రభుత్వ చిత్తశుద్దికి ఇది నిదర్శనమని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందించేందుకు సీఎం నిరంతరంగా కృషిచేస్తున్నారన్నారు. సాగునీటిని అందించేందుకు ఎక్కడ అవసరం వస్తే అక్కడ రిజర్వాయర్లను నిర్మిస్తున్నారన్నారు. మూలనపడిన మార్కెట్‌ను గాడిన పడేందుకు మార్కెట్‌ కమిటీ నిరంతరంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్‌ పాలకమండలికి తోడుగా వ్యాపారులు కూడా తోడ్పాటును అందించడం వల్లే నేడు మార్కెట్‌ సక్రమంగా నడుస్తున్నట్లు తెలిపారు. నగదు రహిత లావాదేవీల ద్వారా రైతులకు నేరుగా ఖాతాలోకి డబ్బులు జమవుతున్నాయని, ప్రతి రైతు బ్యాంక్‌ ఖాతాలను తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు పేదలకు ఓ వరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ పథకం మంచిదే అయినప్పటికీ ఆలస్యం జరగడంతో కొన్ని ఇబ్బందులు వచ్చాయని అన్నారు. అయినా సిఎం కెసిఆర్‌ వెంటనే ఆదేశాలు ఇచ్చి పెళ్లి అయిన తర్వాత కంటే పెళ్లికి వారం ముందే డబ్బులు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. ఈ పథకంతో పేద కుటుంబాలకు మరింత మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.