రైల్వే బడ్జెట్‌ రూ. 1.94 లక్షల కోట్లు : బన్సల్‌

న్యూఢిల్లీ : 2013 -14 రైల్వే బడ్జెట్‌ రూ. 1.94 లక్షల కోట్లుగా ఉంది. 12వ పంచవర్ష ప్రణాళికలో రైల్వే వాటా రూ. 5.19 లక్షల కోట్లు అని కేంద్ర రైల్వే మంత్రి పవన్‌ కుమార్‌ బన్సల్‌ తెలిపారు. 2013-14 రైల్వే బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన లోక్‌సభలో బడ్జెట్‌ను చదివి వినిపించారు. రైల్వే నిర్వహణకు వనరుల వ్యయం పెరిగిందన్నారు. ప్రజల ఆకాంక్షను బడ్జెట్‌ ప్రతిబింబిస్తుందని తెలిపారు. దేశాన్ని ఐక్యం చేసే విషయంలో రైల్వేది కీలక పాత్ర అని చెప్పుకోచ్చారు. భారతీయుల జీవనయానంలో  రైల్వేలదే కీలకపాత్ర అని అన్నారు. నిరంతర నష్టాలు వల్ల రైల్వేల్లో సౌకర్యాలు, సదుపాయాల కల్పనకు విఘాతం కలుగుతుందన్నారు. భారత రైల్వేలు ఆర్థికంగా నిలదోక్కుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. అలహాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటన తమను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ రైల్వేలో రూ. 24, 600 కోట్ల లోటు ఉందని తెలిపారు. వరుస నష్టాల వల్ల కొత్త ప్రాజెక్టుల సత్వర నిర్మాణానికి ఆవరోధం ఏర్పడుతుందన్నారు. ప్రయాణికులు చెల్లించే రుసుంకు తగ్గట్టుగా సేవలు కల్పిస్తామని స్పష్టం చేశారు.