ర్యాగింగ్‌ చేసి.. రాడ్లతో కొట్టి

635985653363718192.jpgనోయిడా: సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌, రాడ్డులతో దాడికి పాల్పడటంతో 11వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడిన సంఘటన నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూలులో చోటుచేసుకుంది. గాయపడిన విద్యార్థులిరువురూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఈ ఘటన చోటుచేసుకోగా, 18 మంది డిపిఎస్ నోయిడా విద్యార్థులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 12వ తరగతి విద్యార్థులు హాస్టల్‌లో తమ పిల్లలను ర్యాంగింగ్‌ చేసి, దాడికి దిగినట్టు గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా, 12వ తరగతి విద్యార్థులు కొందరు తరచు తమను వేధిస్తుండేవారని, తమ ఆహారం లాక్కునేవారని బాధిత విద్యార్థి ధ్రువ్ అగర్వాల్ తెలిపాడు. సీల్డ్ ప్యాకెట్లలో వారికి ఆహారం తెచ్చి ఇవ్వకుంటే దానిని తమ ముఖాలపైకి విసిరికొట్టి అవమానించేవారని చెప్పాడు. మరో విద్యార్థి యష్ ప్రతాప్ సింఘ్ తండ్రి అర్జున్ సింగ్ కాలేజీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ర్యాగింగ్‌కు పాల్పడిన విద్యార్థులు నా కుమారుడిపై రాడ్లతో దాడి చేశారు. ఆ తర్వాత నా కుమారుడి పరిస్థితి ఎలాగ ఉందో కూడా సమాచారం ఇవ్వలేదు’ అని ఆయన వాపోయారు. కేవలం 15 రోజుల క్రితమే తన కుమారుడు స్కూలుకు వచ్చినట్టు తెలిపారు.