లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జర్నలిస్టులు!
– నోయిడాలో ఘటన
నోయిడా, జనవరి30(జనంసాక్షి) : లంచం తీసుకుంటూ ముగ్గురు జర్నలిస్టులు, ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పట్టుబడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో చోటుచేసుకుంది. లంచం తీసుకోవడం, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో వీరిపై కేసులు నమోదయ్యారు. సెక్టార్ 20 పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో మనోజ్ కుమార్‌పంత్, జర్నలిస్టులు సుశీల్ పండిట్, ఉదిత్ గోయల్, రామన్ థాకూర్‌లను నిన్న అరెస్ట్ చేసినట్లు సీనియర్ సూపరిడెంట్ ఆఫ్ పోలీస్ వైభవ్ కృష్ణ తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ ఈ నలుగురు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడినట్లు చెప్పారు. నవంబర్ 2018లో నమోదైన ఓ కేసు విషయంలో వీరు బెదిరింపులకు పాల్పడ్డారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు తీసివేయడంపై కాల్ సెంటర్ యజమానికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడి లంచం డిమాండ్ చేశారు. సమాచారం మేరకు పోలీసు ఉన్నతాధికారులు స్టేషన్‌పై రైడ్ చేసి నిందితులను ప్రత్యక్షంగా పట్టుకున్నారు. రూ. 8 లక్షల నగదు, ఓ మెర్సిడెజ్ బెంజ్ కారును సీజ్ చేశారు. పట్టుబడ్డ జర్నలిస్టుల్లో ఒకరు ఇప్పటికే పలు క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్నట్లుగా
సమాచారం. మరో జర్నలిస్ట్ నుంచి పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదనపు ఎస్‌హెచ్‌వో జైవీర్ సింగ్‌ను విధుల ఉంచి సస్పెండ్ చేశారు.



