లండన్‌లోనూ మాల్యాకు చేదు అనుభవం

మార్టిగేజ్‌ లోన్‌ చెల్లింపులో విఫలం

లీగల్‌ ఫీజు కింద 88 వేల పౌండ్లు చెల్లించాలని కోర్టు ఆదేశం

లండన్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): బ్యాంకు రుణాల ఎగవేతదారు విజయ్‌ మాల్యాకు లండన్‌ కోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. యూబీఎస్‌ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు కోర్టు కఠినమైన తీర్పునిచ్చింది. బ్యాంకర్ల లీగల్‌ ఫీజులను చెల్లించాలని ఆదేశించింది. దీంతో విజయ్‌ మాల్యా వ్యవహారశైలి తప్పు అని, బ్యాంకర్లు కేసు పెట్టడం సరైనదేనని చెప్పినట్లయింది.

యూబీఎస్‌ బ్యాంకుకు లీగల్‌ ఫీజుగా 88 వేల పౌండ్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు అనుమతించాలని మాల్యా చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మాల్యా లండన్‌లోని లక్షలాది పౌండ్ల విలువైన బంగళాపై స్విస్‌ బ్యాంక్‌ యూబీఎస్‌ ఏజీ నుంచి 20.4 మిలియన్‌ పౌండ్ల తనఖా రుణం పొందారు. రోజ్‌ క్యాపిటల్‌ వెంచర్స్‌ పేరుతో ఈ రుణం పొందారు. దీనిని తిరిగి చెల్లించడంలో మాల్యా విఫలమవడంతో ఆ బ్యాంకు బ్రిటన్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ బంగళాను తిరిగి తమకు స్వాధీనం చేయాలని కోరింది. బంగళాలో మాల్యాతో పాటు ఆయన కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. రోజ్‌ క్యాపిటల్‌ వెంచర్స్‌ మాల్యా కుటుంబ ట్రస్టుల్లో ఒకటి అని తెలుస్తోంది.