లక్ష్యం సాధించాలంటే కష్టపడాల్సిందే
పోటీ పరీక్షల కోసం స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టాలి
ఉద్యోగం దక్కాలంటే సీరియస్‌గా చదవాలి
పోటీ పరీక్షల శిక్షణా కేంద్ర ప్రారంభోత్సవంలో డిప్యూటి సిఎం కడియం
మహబూబాబాద్,జూన్29(జనం సాక్షి): పోటీని తట్టుకోవాలంటే కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలని, పోటీ పరీక్షల కోసం కష్టపడక తప్పదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యార్థులకు ఉద్బోధించారు. ముఖ్యంగా ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మొదట స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టాలన్నారు. ఫేస్ బుక్, వాట్సప్ వంటి సోషల్ విూడియాకు దూరంగా ఉండాలన్నారు. వీటిలోకి వెళ్తే బయటకు రాలేమని అందుకే దూరంగా ఉండాలని సూచించారు. గెలుపు సాధించాలంటే సీరియస్‌గా చదవాలన్నారు. ప్రతిరోజు 8 గంటలు చదవడం, 2 గంటలు ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయడం, 8 గంటలు పడుకోవడం.. ఇలా ప్రతి అభ్యర్థి తనదినచర్యను ప్లాన్ చేసుకోవాలన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండల కేంద్రంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ఉచిత శిక్షణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు సమయ నిర్వహణ, స్టడీ చిట్కాలు, దేహదారుడ్య పరీక్షల్లో పాస్ కావడానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై మంత్రి కడియం క్లాస్ చెప్పారు. ఇక్కడకు వచ్చే ముందు విూ పరీక్షల స్జబెక్టు తెలువక ప్రిపేర్ కాలేదు. నేను 1975 లో ఎంఎస్సీ పూర్తి చేసి, 1987 లో లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేశాను. అప్పటి నుంచి పాఠాలు చెప్పడం మాని, రాజకీయ పాఠాలు చెబుతున్నా. ఈ ఉచిత శిక్షణను ఒక అవకాశంగా, అదృష్టంగా భావించి ఉపయోగించుకోవాలి..’ అని కడియం అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 1975 లో నేను ఎమ్మెస్సీ పాస్ అయినప్పుడు నాకున్న పేదరికానికి నేను ఎమ్మెస్సీ చదువుతానని ఊహించలేదు. చిన్నతనంలో వ్యవసాయ కూలి పనులకు వెళ్ళాను. అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. పీయుసీ పాస్ అయ్యాక ఫారెస్ట్ ఉద్యోగం వచ్చింది. అడవుల్లోకి పంపనని మా అమ్మ వద్దంది. తర్వాత టీచర్ ఉద్యోగం వచ్చింది. నీకు టీచర్ కాదు లెక్చరర్ కావాలని మా అన్న నన్ను తన రూంలో పెట్టుకొని చదివించాడు. అందుకే ఎమ్మెస్సీ పూర్తి చేశాను. కష్టపడి చదివితే సాధించవచ్చని చెప్పడానికే.. ఇదంతా చెప్పాను. అలా కష్టపడటం వల్లే నేడు విూముందు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాను. విూరు కూడా కష్టపడి చదివితేనే విజయం సాధిస్తారు..’ అని చెప్పారు. మూడు దశల్లో నిర్వహించే ఈ పరీక్షల్లో ప్రిలిమ్స్, ఫిజికల్ టెస్ట్, మెయిన్స్ పాస్ కావడం అంత సులభం కాదన్నారు. ఇటీవల ఆర్మి నియామకం కోసం జరిగిన పరీక్షల్లో 4000 మంది ప్రిలిమ్స్ పాస్ అయితే ఫిజికల్ టెస్ట్ లో కేవలం 400 మంది మాత్రమే పాస్ అయ్యారని కడియం గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక 1,07,000 ప్రభుత్వ పోస్టులు ఖాళీలు ఉన్నాయని గుర్తించిన సీఎం కేసీఆర్ వాటిని భర్తీ చేసే కార్యక్రమం చేపడుతున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకేసారి 18 వేల ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయలేదన్నారు. ఇంత పెద్ద ఎత్తున పోస్టులు ఉండడంతో పోటీ కూడా బాగా ఉందన్నారు. పీజీ, బీటెక్, సాప్ట్ వేర్ ఉద్యోగులు కూడా కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారని చెప్పారు. ఎందుకంటే సాప్ట్ వేర్ ఉద్యోగులకు నెలకు 16 వేల నుంచి 25 వేల రూపాయల జీతం వస్తుందని, కానీ కానిస్టేబుల్‌కు కనీసం 25 వేల నుంచి జీతం మొదలవుతుందన్నారు. అంతే కాకుండా ఇక్కడ ఉద్యోగ భద్రత ఉందని ప్రైవేట్ లో భద్రత లేకపోవడంతో పెద్ద ఎత్తున పోటీ ఉందని చెప్పారు. ఇలాంటి పోటీలో నెగ్గాలంటే బాగా కష్టపడి పనిచేయాలన్నారు. తాను చదివినన్ని తరగతుల్లో ఫస్ట్ వచ్చేవాడినని, ఎప్పుడూ ఫెయిల్ కాలేదన్నారు. విూరు కూడా ఫెయిల్ కాకుండా విూ పరీక్షల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఉద్యోగాలు పొందాలని ఆశీర్వదించారు. విూరు మొదట ఈ ఉద్యోగాన్ని సాధిస్తే విూ విూద విూకు నమ్మకం పెరుగుతుంది. అప్పుడు ఇంకా పెద్ద ఉద్యోగాలకు వెళ్లొచ్చు అన్నారు. ఈ సమావేశంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, టీఆర్‌ఎస్ నేత నాగుర్ల వెంకన్న, మహబూబాబాద్ కలెక్టర్ శివలింగయ్య, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి, ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు, జయశంకర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సత్యనారాయణ, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.