లాభాలతో మొదలయిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ దేశాల జాబితాలో భారత్‌ టాప్‌ 100లో చోటు దక్కించుకోవడంతో దేశీయ మార్కెట్లు బుధవారం లాభాల బాటపట్టాయి. ప్రపంచ బ్యాంకు నివేదికతో బుధవారం స్టాక్‌ మార్కెట్లు సరికొత్త రికార్డుల్లో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభపడగా.. నిప్టీ తొలిసారిగా 10,400 మార్క్‌ను దాటింది. ప్రారంభంలోనే 200 పాయింట్ల లాభంతో మొదలైన బాంబే స్టాక్‌ ఎక్స్చేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 350 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడవుతోంది. అటు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ సూచీ నిప్టీ సరికొత్త రికార్డును సృష్టించింది. తొలిసారి నిప్టీ 10వేల 400 మార్క్‌ ను దాటింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 279 పాయింట్లు ఎగబాకి 33,492 వద్ద, నిప్టీ 77 పాయింట్ల లాభంతో 10,413 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.57గా కొనసాగుతోంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎయిర్‌టెల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, టాటాస్టీల్‌ తదితర షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి.