లాభాల పంట

– నష్టాల నుంచి తేరుకని లాభాల్లో పయనించిన స్టాక్‌ మార్కెట్లు
ముంబాయి, ఆగస్టు3(జ‌నం సాక్షి) : స్టాక్‌మార్కెట్‌లు మళ్లీ జోరందుకున్నాయి. ఆర్‌బీఐ వడ్డీరేట్ల పెంపుతో గత రెండు సెషన్లలో కుదేలైన దేశీయ మార్కెట్లు శుక్రవారం ఆ నష్టాల నుంచి కోలుకోవడమే కాదు.. భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ ఆందోళనలు సద్దుమణగడం, ఆర్‌బీఐ వడ్డీరేట్ల ప్రభావం తగ్గడంతో దేశీయ మదుపర్లు నేడు మళ్లీ కొనుగోళ్ల బాటపట్టారు. దీంతో సూచీలు పరుగులు తీశాయి. శుక్రవారం ఉదయం మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 180 పాయింట్లకు పైగా లాభంతో సెన్సెక్స్‌, 11,300 మార్క్‌పైన నిఫ్టీ ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. బ్యాంకింగ్‌, ఫార్మా, లోహ, విద్యుత్‌, ఆటోమొబైల్‌ రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో ఆద్యంతం జోరును కనబర్చిన సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 391 పాయింట్లు లాభపడి 37,556 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 116 పాయింట్ల లాభంతో 11,360 వద్ద సరికొత్త రికార్డులో ముగిసింది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 68.79గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, వేదాంత లిమిటెడ్‌, యస్‌ బ్యాంక్‌, గెయిల్‌ షేర్లు లాభపడగా.. టెక్‌మహీంద్రా, టాటామోటార్స్‌, గ్రాసిమ్‌, హీరోమోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.