లారీఢీకొని ముగ్గురు మృతి

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): కరీంనగర్‌  జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు  దుర్మరణం చెందారు.  తిమ్మాపూర్‌ మండలం మహాత్మానగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు తీవ్రగాయాల పాలయ్యారు. తిమ్మాపూర్‌ నుంచి కరీంనగర్‌ వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతిచెందిన వారిలో ఇద్దరు తిమ్మాపూర్‌ కు చెందిన వారు కాగా, మరొకరు రామకృష్ణ కాలనీకి చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వారిని పోస్ట్‌ మార్టం నిమిత్తం కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎల్‌ ఎమ్‌ డీ పోలీసులు తెలిపారు.
ట్రావెల్స్‌ బస్సు బోల్తా
ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడిన ఘటన నల్గొండ జిల్లా కట్టంగూర్‌ మండలం అయిటిపాముల గ్రామం వద్ద జరిగింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే కామినేని ఆస్పత్రికి తరలించారు. భద్రాచలం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న భద్రాద్రి ట్రావెల్స్‌ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
శంషాబాద్‌ ఫ్లై ఓవర్‌పై ప్రమాదం
అంతర్జాతీయ విమానాశ్రాయానికి వెళ్లే శంషాబాద్‌ ఫ్లై ఓవర్‌పై రోడ్డుప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
నీటితొట్టెలో పడి బాలుడు మృతి
వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని శాయంపేటలో విషాదం చోటుచేసుకుంది. మెండు భార్గవ (7) అనే బాలుడు ప్రమాదశాత్తు నీటిహౌస్‌ లో పడి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు అక్కడికి చేరుకుని నీటిహౌస్‌ లో నుంచి బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. భార్గవ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్గవ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

తాజావార్తలు