లాలూ కుటుంబానికి ఊరట!

– ఐఆర్‌సీటీసీ కేసులో బెయిల్‌ మంజూరు
– రబ్రీదేవీ, తేజస్వీయాదవ్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు బెయిల్‌ మంజూరు
– రూ. లక్ష షురిటీతో బెయిల్‌ మంజూరి చేసిన పటాలియా హౌస్‌ కోర్టు
న్యూఢిల్లీ, ఆగస్టు31(జ‌నం సాక్షి) : ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ కుంభకోణం (ఐఆర్‌సీటీసీ) కేసులో మనీ లాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ భార్య రబ్రీదేవి, తనయుడు తేజస్వి యాదవ్‌కు ఊరట లభించింది. ఈ కేసులో ఈ ఇద్దరికీ బెయిల్‌ మంజూరైంది. వీరితో పాటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులందరికీ పటియాలా హౌస్‌ కోర్టు బెయిలిచ్చింది. నిందితులందరూ తలో రూ.లక్ష రూపాయల బాండ్‌, ష్యూరిటీ కింద కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబర్‌ 6వ తేదీకి వాయిదా వేసింది. భారత రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) ¬టళ్ల టెండర్లకు సంబంధించిన కుంభకోణం కేసులో లాలూ, ఆయన భార్య, కుమారుడు తేజస్వీ యాదవ్‌తో పాటు మరికొందరు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 2006లో రాంచీ, పూరిలోని ఐఆర్‌సీటీసీ ¬టళ్లను ప్రయివేటు సంస్థలకు అప్పగించారు. ఆ సమయంలో లాలూ రైల్వేశాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఈ కాంట్రాక్టులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. టెండర్లు తమకు వచ్చేలా చేసినందుకు గానూ.. సదరు ప్రయివేటు సంస్థలు లాలూ కుటుంబానికి పట్నాలో మూడెకరాల కమర్షియల్‌ ఫ్లాట్‌ను ఇచ్చినట్లు కేసు నమోదైంది. దీంతో ఈ కుంభకోణంపై విచారణ చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు లాలూ, ఆయన కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు. అటు సీబీఐ అధికారులు కూడా ఈ ఏడాది ఏప్రిల్‌లో లాలూ, రబ్రీదేవీ, తేజస్వీ సహా 12 మందిపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. దీంతో ఈ కేసులో బెయిల్‌ కోరుతూ లాలూ కుటుంబం పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం రబ్రీదేవీ, తేజస్వీకి బెయిల్‌ మంజూరు చేసింది. కాగా.. దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో ఉన్న లాలూ శుక్రవారం కోర్టుకు హాజరుకాలేదు. ఈ కేసులో లాలూపై ప్రొడక్షన్‌ వారెంట్‌ జారీ చేయాలని సీబీఐ న్యాయస్థానాన్ని కోరగా.. అందుకు కోర్టు అంగీకరించింది. దీంతో అక్టోబరు 6న లాలూను కోర్టులో హాజరుపరచనున్నారు.