లాలూ కుటుంబానికి ఊరట!

– ఐఆర్‌సీటీసీ స్కామ్‌లో లాలూ దంపతులకు బెయిల్‌
న్యూఢిల్లీ, జనవరి28(జ‌నంసాక్షి) :  ఐఆర్‌సీటీసీ స్కామ్‌ కేసులో మనీ ల్యాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌ సహా ఇతరులకు ఢిల్లీలోని పటియాల హౌస్‌ కోర్టు సోమవారం రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. రూ లక్ష వ్యక్తిగత బాండ్‌ అదే మొత్తం పూచీ కత్తుపై వారికి బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 11కు వాయిదా వేసింది. ఐఆర్‌సీటీసీ స్కామ్‌ కేసులో బెయిల్‌ లభించడం పట్ల తేజస్వి యాదవ్‌ స్పందిస్తూ ఈ కేసులో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని, న్యాయవ్యవస్ధ పట్ల తమకు విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు. ఇదే కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌కు శనివారం రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో లాలు మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. పూరి, రాంచీలో రెండు ఐఆర్‌సీటీసీ ¬టళ్ల నిర్వహణను ఓ ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టడంలో లాలూ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ లాలూచీ పడ్డారని దర్యాప్తు ఏజెన్సీ ఆరోపిస్తోంది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 11వతేదీకి కోర్టు జడ్జి వాయిదా వేశారు. కోర్టు బెయిలుపై తేజస్వీ యాదవ్‌ వ్యాఖ్యానిస్తూ తమకు న్యాయవ్యవస్థపై నమ్మకముందని, తమకు న్యాయం జరుగుతుందన్నారు.