లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నియంత్రణలో అవినీతి నిరోధక శాఖ 

స్పష్టం చేసిన సుప్రింకోర్టు ధర్మాసనం
ఏకాభిప్రాయం కోసం విస్తృత ధర్మాసనానికి బదిలీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): ఢిల్లీలోని అవినీతి నిరోధక శాఖ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నియంత్రణలో ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గురువారం ఈమేరకు సుప్రింకోర్టు తీర్పును వెలువరించింది.
అధికారాల విషయంలో సర్వోన్నత న్యాయస్థానంలో దిల్లీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి నిరోధక శాఖ, విచారణ కమిషన్‌ వంటివి లెప్టినెంట్‌ గవర్నర్‌ నియంత్రణలోనే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే సర్వీసులపై తీర్పులో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ విషయాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు కోర్టు తెలిపింది. మొత్తం ఆరు అంశాలపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. అవినీతి నిరోధక శాఖపై లెప్టినెంట్‌ గవర్నర్‌ నియంత్రణ ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. అంతేగాక.. విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేసే అధికారం కూడా ఎల్‌జీకే ఉంటుందని తేల్చి చెప్పింది. ఇక ఎలక్ట్రిసిటీ కమిషన్‌, విద్యుత్‌బోర్డుపై అధికారం మాత్రం దిల్లీ ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొంది. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, ఇతర న్యాయ అధికారుల నియామకాన్ని కూడా దిల్లీ ప్రభుత్వమే చేపడుతుందని స్పష్టం చేసింది. అంతేగాక.. వ్యవసాయ భూముల ధరలను కూడా ప్రభుత్వమే సవరించుకోవచ్చని తెలిపింది. కాగా.. సర్వీసులపై నియంత్రణ ఎవరిది అన్న దానిపై న్యాయమూర్తులు జస్టిస్‌ సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఈ అంశంపై త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరుస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. దిల్లీలో అధికారాలపై గత కొంతకాలంగా ప్రభుత్వం, లెప్టినెంట్‌ గవర్నర్‌ మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎవరి ఆదేశాలు పాటించాలి. విచారణ కమిషన్‌ను ఎవరు ఏర్పాటు చేయాలి, రాష్ట్రంలో సర్వీసులను ఎవరు నియంత్రించాలి అన్న దానిపై స్పష్టత కొరవడింది. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా.. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గతేడాది నవంబరు 1న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా నేడు తీర్పు వెలువర్చింది. పోలీసులపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉండవని కోర్టు వెల్లడించింది. విచారణ కమిటీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకరికి ఒకరు సహకరించుకోవాలన్నారు. ఎలక్ట్రిసిటీ బోర్డు నిర్ణయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉంటాయన్నారు. అయితే ఢిల్లీలో ఉన్న ఆఫీసర్లపై ఎవరికి అధికారాలు ఉంటాయన్న దానిపై ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టు మొత్తం ఆరు అంశాలపై గురువారం తన తీర్పును వెలువరించింది. ఏసీబీ, పోస్టింగ్‌, ట్రాన్స్‌ఫర్ల అంశాలు కేంద్ర పరిధిలో ఉంటాయని జస్టిస్‌ సిక్రీ తెలిపారు. ఇక నుంచి గ్రేడ్‌ 1, గ్రేడ్‌ 2 అధికారుల బదిలీ కేంద్రం ఆధీనంలో ఉంటాయని, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను నియమించే ప్రత్యేక అధికారాలు మాత్రం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయన్నారు. సర్వీసెస్‌పై మాత్రం తాము నిర్ణయం తీసుకోవడం లేదని జస్టిస్‌ భూషన్‌ తెలిపారు. త్రిసభ్య ధర్మాసం దానిపై తీర్పును వెల్లడిస్తుందన్నారు. రెవన్యూ శాఖ, గ్రేడ్‌ 3, గ్రేడ్‌ 4 ఆఫీసర్ల పోస్టింగ్‌, బదిలీలు అన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని తెలిపారు. ఏవైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయితే, అప్పుడు ఆ అంశాలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జోక్యం తీసుకుంటారరిన కోర్టు పేర్కొంది.