లోక్‌సభలో రఫేల్‌ రగడ

– జేపీసీతో దర్యాప్తు జరిపించాలని విపక్షాల పట్టు
– రఫెల్‌ ఒప్పందం అంతా సవ్యంగానే సాగింది
– దీనిపై మాట్లాడాల్సిందేవిూ లేదు
– కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి8(జ‌నంసాక్షి) : రఫేల్‌ ఒప్పందంలో లోక్‌సభలో మరోసారి రచ్చ జరిగింది. ఈ ఒప్పందంపై రక్షణశాఖకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి కార్యాలయం ఫ్రాన్స్‌తో సమాంతరంగా చర్చలు జరిపిందంటూ ఓ జాతీయ విూడియా కథనం పేర్కొంది. ఈ కథనాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్ష ఎంపీలు కేంద్రంపై ధ్వజమెత్తారు. రఫేల్‌పై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేపట్టాలంటూ డిమాండ్‌ చేశారు. జీరో అవర్‌లో ప్రతిపక్షాల ప్రశ్నలను సుమోటోగా తీసుకున్న రక్షణ మంత్రి నిర్మల సీతారామన్‌ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. ప్రతిపక్షాలు చచ్చిన గుర్రాన్ని మళ్లీ మళ్లీ కొడుతున్నారని, ఈ అంశంపై సమయానుకూలంగా ప్రధానమంత్రి కార్యాలయం ఆరా తీయడాన్ని, ప్రత్యక్ష జోక్యంగా భావించరాదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు భారత భద్రతా దళాల తరపున మాట్లాడడం లేదనీ… బహుళ దేశీయ కంపెనీలు, స్వప్రయోజనాల కోసమే అర్థం లేదని ఆరోపణలు చేస్తున్నాయని నిర్మల దుయ్యబట్టారు. రాఫెల్‌ ధరలపై ఫ్రాన్స్‌ కంపెనీతో ప్రధాని కార్యాలయం చర్చలు జరపడాన్ని నాటి రక్షణ కార్యదర్శి విభేదించారన్న దానిపైనా నిర్మల స్పందించారు. అంతా సవ్యంగానే ఉందనీ.. అధికారులు ఈ విషయాన్ని అక్కడితో వదిలేయాలని నాటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఆ లేఖకు సమాధానం రాశారని ఆమె వివరించారు. యూపీఏ హయాంలో నాటి జాతీయ సలహా మండలి చైర్మన్‌ సోనియా గాంధీ తరచూ పీఎంవో కార్యాలయాన్ని సైతం పర్యవేక్షించారని, మరి అది జోక్యం చేసుకోవడం కాదా అని కేంద్రమంత్రి ప్రతిపక్షాలను సూటిగా ప్రశ్నించారు. రఫేల్‌పై తాము చెప్పాల్సిందంతా చెప్పేశామని, దీనిపై ఇంకా మాట్లాడటం సమయం వృథా అని అన్నారు. రాఫేల్‌ ఒప్పందంపై విూడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, పీఎంవో సవిూక్షను జోక్యం చేసుకోవడం అని చెప్పలేంమని అన్నారు. దేశద్రోహి కాంగ్రెస్‌ పార్టీ కాదు ముమ్మాటికి బీజేపీనే అని కాంగ్రెస్‌ లోక్‌ సభ పక్షనేత మల్లికార్జున ఖర్గే అన్నారు. రాఫెల్‌ డీల్‌ పై హౌస్‌ లో ఇప్పటికే చాలా సార్లు అసత్య వివరణలు విన్నామనీ., ఇకనైనా ప్రధాని, రక్షణ మంత్రి తమ అబద్దపు ప్రసంగాలను ఆపాలనీ పేర్కొన్నారు. రాఫెల్‌ డీల్‌ పై జేపీసీ వేయాలని కూడా ఖర్గే  డిమాండ్‌ చేశారు. జేపీసీతోనే ఏవి పాలో.,  ఏవి నీళ్ల తెలుస్తోందని దుయ్యబట్టారు. రాఫేల్‌ ఒప్పంద సమయంలో జరిగిన అవినీతిని ది హిందూ పేపర్‌ ఏనాడో బట్టబయలు చేసిందని ఖర్గే వ్యాఖ్యానించారు.