వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే

– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌

వరంగల్‌ అర్బన్‌,సెప్టెంబర్‌ 22,(జనంసాక్షి):2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటురాష్ట్రలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌కమిటీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇందిరమ్మ బాట కార్యక్రమం జరిగింది. తొలుత ఇందిరమ్మ చిత్రపటానికి పూలమాల వేసిన పార్టీ నాయకులు అనంతరం జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌అధికారంలో రావటం ఖాయమని, వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో 12కు 12 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటామన్నారు. ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలోకి వెళ్లి తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న మాయలగారడిని ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. డిసెంబర్‌ 28న రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆవిర్భావవేడుకలు నిర్వహించాలన్నారు. ఇందిరమ్మ బాట కార్యక్రమం ముగింపు అయిన తరువాత తెలంగాణాలో ఎక్కడో ఒక చోట భారీ బహిరగ సభను నిర్వహిస్తామి, ఈ బహిరంగ సభకు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఐకమత్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. అందరిని కలుపుకొని పోయి టీఆర్‌ఎస్‌ భరతం పడతామన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఈ సందర్భంగా ఉత్తమ తెలిపారు. అధికార పార్టీ నేతలుకానీ, టీఆర్‌ఎస్‌ నేతలు కానీ కాంగ్రెస్‌ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్‌ అంటూ ఉత్తమ్‌ హెచ్చరిచారు. ఎవరిని మరిచిపోమని, 2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని అందరిని గుర్తుపెట్టుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి కుంతియా, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క, పార్టీ జిల్లా అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.