వచ్చే ఎన్నికల్లో విపాట్‌ యంత్రాలు: ఇసి

న్యూఢిల్లీ,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాలలో ఓటు రసీదు యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించనున్నట్లు ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా చెప్పారు. ఓటు రసీదు యంత్రాలపై ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్షలు విజయవంత మయ్యాయని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాలలో ఓటు రసీదు యంత్రాలను వినియోగించేందుకు ఎన్నికల కమిషన్‌ కట్టుబడి వుందని అన్నారు. ఓటింగ్‌ యంత్రంపై అభ్యర్థి పేరు ఎదురుగా వున్న బటన్‌ను నొక్కిన తరువాత ఆ పార్టీ గుర్తుపై ఓటు నమోదయిందన్న విషయాన్ని తెలియచేస్తూ ఈ యంత్రం రసీదును వెలువరిస్తుంది. అయితే ఓటరు దానిని అక్కడే వున్న ఒక బాక్స్‌లో పడేయాలి తప్ప ఇంటికి తీసుకెళ్లటానికి వీలు లేదు. ఇకపోతే ఆయన జిల్లాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులతో భేటీ అయి 2019 ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికలకు అవసరమైన ఓటింగ్‌ యంత్రాలను, సిబ్బందికి శిక్షణ, రవాణా సౌకర్యాలను అందుబాటులో వుంచుకోవాలని ఆయన సూచించారు. చెల్లింపు వార్తల అంశంపై ఆయన మాట్లాడుతూ ఈ ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల కమిషన్‌ అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ఓటర్ల నమోదు పక్రియను ఎన్నికల కమిషన్‌ నిరంతరం సవిూక్షిస్తునే వుంటుందని ఆయన చెప్పారు.