వచ్చే ఎన్నికల దాకా ఎందుకు?

పంచాయితీ ఎన్నికల్లో గెలిచి చూపండి
కాంగ్రెస్‌కు జీవసమాధి తప్పదన్న ఎర్రబెల్లి
జనగామ,మే31(జ‌నం సాక్షి): పంచాయితీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం టిఆర్‌ఎస్‌దే అని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అంటున్న కాంగ్రెస్‌ నేతలు ముందుగా పంచాయితీ ఎన్నికల గండం నుంచి బయటపడాలని సవాల్‌ విసిరారు. తెలంగాణలో అన్ని సర్పంచ్‌ స్థానాలు కైవసం చేసుకుని కాంగ్రెస్‌ విమర్శలకు అడ్డుకట్ట వేయడానికి ప్రజలే తయారుగా ఉన్నారని అన్నారు.  రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య రాబంధు పథకంగా అభివర్ణించడం ఎంత దారుణమో రైతులు గమనిస్తున్నారని అన్నారు. అందుకే వారు పంచాయితీ ఎన్నికల్లోనే కాంగ్రెస్‌ను ఖతం చేస్తారని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే…కాంగ్రెస్‌ నేతల కాళ్ల కింద భూమి కదులుతుందని, అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని పట్టించుకోక, ఈ ప్రాంతాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన పొన్నాల లాంటి నేతలు రైతుల గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు.
జలయజ్ఞంతో ధనయజ్ఞం చేసి ప్రజల సొమ్మును దోచుకున్న అసలు రాంబందులు వీరన్నారు. రైతుబంధు పథకాన్ని రాబంధు పథకమంటే రైతులే వీరికి బుద్ధి చెబుతారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వాలని, విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచాలని, భూ రికార్డులు ప్రక్షాళన చేయాలని, రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరాకు 8వేలు రూపాయలు ఇవ్వాలని, రైతు కుటుంబానికి బీమా కల్పించాలని ఏనాడైనా ఎందుకు ఆలోచించ లేదన్నారు.  చెరువల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తలేని సన్నాసులు ఇవాళ మళ్లీ అధికారం మాదే అంటే ప్రజలు ఊరుకుంటారా అని అన్నారు. కాంగ్రెస్‌కు జీవసమాధి తప్పదన్నారు. ఇక వారు అధికారంలోకి వస్తమాన్న ఆలోచన మానుకుంటే మంచిదన్నారు. రైతు బంధు పథకం కింద రైతుకు పెట్టుబడి ఇవ్వడం దేశంలో ఎక్కడైనా జరిగిందా అని అన్నారు. దమ్ముంటే కర్నాటకలో దీనిని అమలు చేయించాలన్నారు. ఇకపోతే దేశంలో ఎక్కడా     లేనివిధంగా ముఖ్యమంత్రి కేసిఆర్‌ రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చారన్నారు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ కుటుంబ సభ్యులు రోడ్డున పడకుండా ఉండేందుకు 5 లక్షల రూపాయల బీమాను ఈ పథకం కింద చేస్తున్నారన్నారు. ఈ పథకం రైతులకు చాలా ఉపయోగపడేదని, దీనిని రైతుబంధు కింద లబ్ధి పొందిన ప్రతి రైతుకు అందేలా పనిచేయాలన్నారు. అందుకే పంచాయితీ ఎన్నికల్లో తమదే విజయమని గట్టిగా చెప్పగలుగుతున్నామని అన్నారు. ప్రజలే ఇప్పుడు తమకు ప్రచార సారధులని అన్నారు. వారే కాంగ్రెస్‌ను బొందపెడతారని అన్నారు.