వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేస్తాం…లోక్‌సత్తా
హిమాయత్‌నగర్: వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు మన్నారం నాగరాజు ప్రకటించారు. శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో అంకితభావంతో పని చేసిన వారినే అభ్యర్థిగా ఎంపిక చేస్తామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి అనేక ప్రయోజనాలు రావాల్సి ఉందని, అయితే, ప్రస్తుతమున్న ఎంపీలు వాటిపై శ్రద్ధ చూపడం లేదన్నారు. కొత్త రాష్ట్రం అవసరాలను పార్లమెంట్ వేదికగా వినిపించడం, నియోజకవర్గం స్థాయిలో అభివృద్ధి పనులకు ఎంపీ నిధులతో తోడ్పాటునందించడం, బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి పాటు పడటం లక్ష్యాలుగా తమ పార్టీ అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దింపుతున్నామని నాగరాజు చెప్పారు