వరంగల్ జిల్లా కోర్టులో ఉద్రిక్తత
వరంగల్ లీగల్: వరంగల్ జిల్లా హన్మకొండలోని జిల్లా కోర్టులో మంగళవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైకోర్టు విభజన, న్యాయమూర్తుల నియామకంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని కోర్టుల వద్ద న్యాయవాదులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనలో భాగంగా మంగళవారం జిల్లా కోర్టులో విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్న న్యాయవాదులు ఒక్కసారిగా కోర్టు హాలులోకి చొచ్చుకు వెళ్లి కుర్చీలు, బల్లలు విసిరేసారు. అక్కడే బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసుల న్యాయవాదులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అతికష్టం మీద పోలీసులు న్యాయవాదులను కోర్టు హాలు నుంచి బయటకు పంపారు. ఆంధ్ర న్యాయమూర్తులకు వ్యతిరేకంగా న్యాయవాదులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పీడియం కోర్టు, మొదటి అదనపు జిల్లా కోర్టులో బెంచీలు, కుర్చీలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.