వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారుపై కసరత్తు
హైదరాబాద్ : వరంగల్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేసేందుకు దిగ్విజయ్‌సింగ్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. స్థానిక స్థానికేతర వివాదం కాంగ్రెస్‌లోనూ కలకలం రేపుతోంది. వరంగల్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్షన్ కొనసాగుతోంది. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ స్వయంగా వచ్చి అభిప్రాయసేకరణ జరిపారు. పోటీపడుతున్న ఆశావాహులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. వివేక్, సర్వేసత్యనారాయణ, రాజయ్య, రాజారపు ప్రతాప్ మధ్య పోటీ నడుస్తోంది.
అభిప్రాయసేకరణలో ఎక్కువ మంది వివేక్‌వైపు మొగ్గు చేపినట్లు సమాచారం. రెండో స్థానంలో సర్వేసత్యనారాయణ ఉన్నారు. దిగ్విజయ్‌సింగ్ తన నివేదికను సోనియా గాంధీకి సమర్పించనున్నారు. రెండు రోజుల్లో అభ్యర్థిని నిర్ణయిస్తామని దిగ్విజయ్ ప్రకటించారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వివేక్ దిగ్విజయ్‌కు చెప్పినట్లు సమాచారం. రాజయ్యకు ఇవ్వడం కూడా న్యాయమే అని వివేక్ అన్నట్లు సమాచారం. ఆయనకు సహాయసహకరాలు కూడా ఇచ్చేందుకు తాను రెడీ అని చెప్పినట్లు సమాచారం.
ఇక రాజారపు ప్రతాప్ మాత్రం స్థానికులకే టికెట్ కేటాయించాలని కోరారు. మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ కూడా టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్నారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తనకే టికెట్ అన్న నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడంలో అధిష్టానం సీరియస్‌గా కసరత్తు చేస్తోంది. అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందో నేతలు అంచనా వేయలేకపోతున్నారు