వరంగల్ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
హైదరాబాద్ : జగనన్న బాణం ఓరుగల్లుపై గురిపెట్టింది. నేటి నుంచి వరంగల్ జిల్లాలో షర్మిల తొలి విడత పరామర్శ యాత్ర సాగనుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక జిల్లాలో అసువులు బాసిన వారి కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. మొదటి విడతగా ఐదురోజుల పాటు సాగే ఈ పరామర్శ యాత్రలో మొత్తం 32 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు.
లోటస్‌పాండ్ నుంచి శామీర్‌పేట్, ప్రజ్ఞాపూర్ మీదుగా ….
లోటస్‌పాండ్ నుంచి శామీర్‌పేట్, ప్రజ్ఞాపూర్ మీదుగా చేర్యాల చేరుకొని అక్కడ బస్వగల్ల యాదగిరి కుటుంబాన్ని పరామర్శిస్తారు షర్మిల. అనంతరం బచ్చన్నపేట, మద్దూరు గ్రామంలోని మరో ఆరుగురు కుటుంబాలను పరామర్శిస్తారు. మొదటి రోజు 154 కిలోమీటర్లు ప్రయాణించి ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని తెలంగాణ వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు.
ఒక్కోరోజు 7 కుటుంబాలను….
వరుసగా నాలుగు రోజుల్లో ఒక్కోరోజు 7 కుటుంబాలను పరామర్శించనున్న షర్మిల.. చివరిరోజు 28వ తేదీన 4 కుటుంబాలను పరామర్శించనున్నారు. పరకాల, పాలకుర్తి నియోజకవర్గాల్లో పరామర్శ యాత్రను పూర్తి చేసుకొని తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరుతారు. అయితే జిల్లాలోని మహబూబాబాద్‌లో జగన్ గత ఓదార్పు యాత్ర ఓ సంచలనానికి దారి తీసింది. ఇప్పుడు షర్మిల పరామర్శ యాత్ర సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరుగకుండా జిల్లా నేతలు అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.