వరల్డ్ కప్ విజేత ఆస్ర్టేలియా… ఫైనల్లో కివీస్ చిత్తు
క్రికెట్ మహా సంగ్రామంలో ఆస్ర్టేలియా జగజ్జేతగా నిలిచింది. నెల రోజులకు పైగా సాగుతున్న పోరాటంలో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఇంకా 16.5 ఓవర్లుండగానే న్యూజిలాండ్ పై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ విధించిన 184 పరుగుల లక్ష్యాన్ని కంగారూలు సునాయాసంగా ఛేదించారు. మూడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేశారు. క్లార్క్ 74 పరుగులు, స్మిత్ 56 పరుగులు, వార్నర్ 45 పరుగులు చేయగా, వాట్సన్ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కివీస్ బౌలర్లు హెన్రీ 2 వికెట్లు, బౌల్ట్ 1 వికెట్ తీశారు.
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఆసీస్ ఆటగాడు స్టార్క్ నిలవగా, ఫాల్కనర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
ఈ విజయంతో అత్యధికసార్లు (ఐదుసార్లు) ప్రపంచకప్ కప్ గెలిచిన జట్టుగా ఆస్ర్టేలియా రికార్డు నెలకొల్పింది. భారత గడ్డపై 1987లో జరిగిన పోరులో ఆస్ర్టేలియా తొలిసారి ప్రపంచకప్ గెలిచింది. ఆ తర్వాత 1999లో ఇంగ్లాండులో, 2003లో దక్షిణాఫ్రికాలో, 2007 కరీబియన్ దీవుల్లో జరిగిన మ్యాచ్ లో కంగారూలు టైటిల్ నెగ్గారు. ఇప్పుడు సొంతగడ్డపై ప్రపంచ కప్ జరిగిన అన్ని ఖండాల్లో ఛాంపియన్ గా నిలిచిన జట్టుగా ఆస్ర్టేలియా రికార్డు సృష్టించింది.
వరల్డ్ కప్ విజేత ఆస్ర్టేలియా ఈ విజయాన్ని కొన్ని నెలల కిందట చనిపోయిన తమ సహ ఆటగాడు ఫిల్ హ్యూస్ కు అంకితమిచ్చింది.
కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి వరల్డ్ కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన క్లార్క్ ఇక వన్డేలకు గుడ్ బై చెప్పాడు.
ప్రపంచకప్ విన్నర్ ఆస్ర్టేలియాకు రూ. 25.8 కోట్లు, రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు రూ. 12 కోట్లు ప్రైజ్ మనీ ఇస్తారు.