వల్మీడి శ్రీ సీతా రామచంద్రస్వామి దేవాలయ పున: ప్రతిష్ఠాపనకు భారీ ఏర్పాట్లు

అంగ‌రంగ వైభ‌వంగా ఆల‌య పునః ప్రారంభం

సెప్టెంబర్ 4న వల్మీడి కి సీఎం కేసీఆర్, చిన జీయ‌ర్ స్వామి రాక‌!

రానున్న మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్

సెప్టెంబర్ 1 నుండి 4వ తేదీ వరకు 4 రోజులపాటు ఘనంగా ఉత్సవాలు

వ‌ల్మీడి స‌హా ఆ చుట్టుముట్టు గ్రామాల్లో అలంక‌ర‌ణ‌లతో పండుగ వాతావ‌ర‌ణం

ఆల‌యానికి వ‌చ్చే ప్ర‌తి భ‌క్తునికి తీర్థ ప్ర‌సాదాల విత‌ర‌ణ‌

అదే రోజు క‌ళ్యాణోత్స‌వం… అంద‌రికీ పాల్గొనే అవ‌కాశం

ముందుకు వ‌స్తున్న దాత‌లు….వెల్లువెత్తుతున్న విరాళాలు

అదే రోజు సిఎం చేతుల మీదుగా మ‌రికొన్ని కార్య‌క్ర‌మాలకు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు

రోప్ వే కు ప్రతిపాదనలు సిద్ధం చేయాల‌ని మంత్రి ఆదేశాలు

వ‌ల్మీడిలో వేద పాఠశాల

మొక్క‌లు నాటిన మంత్రి

విగ్ర‌హాల ఊరేగింపునకు ప్రారంభం

సకుటుంబ సపరివార సమేతంగా తరలి రావాలని ప్రజలకు మ‌రోసారి మంత్రి ఎర్రబెల్లి పిలుపు

వల్మీడి దేవాలయ ప్రాంగణంలో క‌లెక్ట‌ర్‌, అద‌న‌పు క‌లెక్ట‌ర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులతో ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

వల్మీడి (పాలకుర్తి), ఆగష్టు 30 :
ఆది కావ్యం రామాయణాన్ని రాసిన వాల్మీకి పుట్టిన ఊరుగా ప్రతీతి చెందిన వ‌ల్మీడి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి విగ్రహాల పున: ప్రతిష్ఠాపన, ఆల‌య పునః ప్రారంభ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా, అంగరంగ వైభవంగా జరుగనుంది. ఇందుకు భారీ ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. నాలుగు రోజుల పాటు జ‌రిగే ఉత్స‌వాల‌కు త‌ర‌లి వ‌చ్చే భ‌క్తుల కోసం అన్ని స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్నారు. ఆ నాలుగు రోజుల‌పాటు వ‌ల్మీడి రాములోరి గుట్ట మీదే కాదు. ఆ వ‌ల్మీడి గ్రామంతో స‌హా, ఆ చుట్టుముట్టు గ‌ల అన్నిగ్రామాల్లోనూ పండుగ వాతావ‌ర‌ణం ఉట్టిప‌డేలా మామిడి తోర‌ణాల‌ అలంక‌ర‌ణ‌లు జ‌ర‌గున్నాయి. తీర్థ ప్ర‌సాదాల విత‌ర‌ణ‌తోపాటు భ‌క్తుల‌కు ఆ సీతారాముల‌వారి క‌రుణా క‌టాక్ష వీక్ష‌ణాలు ల‌భించే విదంగా ద‌ర్శ‌నాలు జ‌ర‌గ‌నున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌పై ఈ నెల 22న స‌మీక్ష చేసిన మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, మ‌రోసారి 30వ తేదీన వ‌ల్మీడి గుట్ట మీద జిల్లా క‌లెక్ట‌ర్‌, అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్‌, వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి స‌మీక్షించారు. ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ఇంకా జ‌ర‌గాల్సిన ఏర్పాట్ల‌పై అధికారుల‌కు త‌గు సూచ‌న‌లు, స‌ల‌హాలుఇచ్చారు. నిర్ణీత స‌మ‌యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లుజ‌ర‌గాల‌ని ఆదేశించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు మాట్లాడుతూ, ఆది కావ్యంగా కీర్తినందుకున్న రామాయ‌ణాన్ని రాసిన వాల్మీకి వ‌ల్మీడికి చెందిన వాడుగా చ‌రిత్ర బెబుతున్న‌ది. ఇక్క‌డి మునుల గుట్ట మీద వాల్మీకి త‌పస్సు చేసేవాడ‌ట‌. ఆ ప‌క్క‌నే ఉన్న‌రాములోరి గుడి మీద రాముడు, సీత ఉండేవార‌ట‌. రాముడు, సీత స్వ‌యంభువులుగా వెలిశార‌ని, ఆయ‌న పాదాలు కూడా ఇక్క‌డ ఉన్నాయ‌ని ప్ర‌జ‌లు చెబుతున్నారు. ఆ రెండు గుట్ట‌ల మ‌ధ్య‌వాల్మీకి పురం ఉండేద‌ని, కాల క్ర‌మంలో అక్క‌డి ప్ర‌జ‌లంతా వ‌ల్మీడి గ్రామాన్ని నిర్మించుకున్నార‌ని చెబుతారు. ఇక ఇక్క‌డికి కూత‌వేటు దూరంలోనే మ‌హాక‌వి పాల్కురికి సోమ‌నాథుడు, స‌హ‌జ‌క‌వి బ‌మ్మెర పోత‌న‌ల జ‌న్మ‌స్థానాలున్నాయి. ఇంత పురాత‌న సాహిత్య చ‌రిత్ర ఉన్న ప్రాంతం ఈ భూమి మీద మ‌రోటి లేదు. ఇంత గొప్ప చారిత్రాత్మ‌క ప్రాంతానికి నేను ఎమ్మెల్యేగా ఉండ‌టం నా అదృష్టం. అన్నారు. ఇక ఈ వ‌ల్మీడి రాములోరి గుట్ట మీద స్వ‌యంభుగా వెల‌సిన శ్రీ సీతారామ‌చంద్ర స్వామిదేవాల‌యాన్ని పునః ప్రారంభిస్తున్నాం. ఆల‌యంలోని విగ్ర‌హాల పునఃప్ర‌తిష్టాప‌న కార్య‌క్ర‌మాలు ఈ నెల 1వ తేదీ నుండి 4వ తేదీ వ‌ర‌కు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా వల్మీడి శ్రీ సీతారామచంద్ర స్వాముల వారి విగ్రహాల పున: ప్రతిష్టాపన జరగనుండగా, అత్యద్భుతంగా తీర్చిదిద్దిన, కొత్తగా నిర్మించిన దేవాలయాన్ని సీఎం కెసిఆర్ ప్రారంభించనున్నారు. అదే రోజు మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఇతర ప్రజా ప్రతినిధులు రానున్నారు. ఈ కార్య‌క్ర‌మాల‌కు సకుటుంబ సపరివార సమేతంగా తరలి రావాలని ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మ‌రోసారి పిలుపునిచ్చారు.

ఈ మునుల గుట్ట మీదే వాల్మీకి ఘోర త‌ప‌స్సు చేశాడ‌ట‌. దీంతో ఆయ‌న చుట్టూతా పెద్ద వాల్మీకం అంటే… పుట్ట ఏర్ప‌డింద‌ట‌! 24వేల శ్లోకాల‌లో శతకోటి అక్షరాలున్నాయి. ఆ విధంగా రామాయ‌ణం మ‌హా కావ్యం అయింది. ఆ వాల్మీకి మ‌న వాడు, ఇక్క‌డి వాడు కావ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణం. మ‌నంద‌రికి పుణ్యం. పూర్వ జ‌న్మ సుకృతం. అని మంత్రి వివరించారు. ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వల్మీడీలో తలంబ్రాలు పడిన తర్వాతనే భద్రాచలంలో తలంబ్రాలు పడతాయని ప్రతీతి. ఇంత గొప్ప దేవాలయాన్ని పునరుద్ధరించి పూర్వవైభవం తేవాలని సంకల్పించాను. సీఎం కేసీఆర్ గారు అండగా నిలిచారు. అడిగిన వెంటనే నిధులు ఇచ్చి ప్రోత్సహించారు. ఐదు కోట్ల రూపాయలతో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమం ప్రారంభమైందని మంత్రి తెలిపారు.

30 వేల మందికి ఏర్పాట్లు
నాలుగు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు 30 వేల మందికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మీరు షామ్యానాలు టెంట్లు కుర్చీలు ఇతర వసతులతో కూడిన ఏర్పాట్లను చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఏర్పాట్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు కంట్రోల్ రూం
మొత్తం ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించ‌డానికి పూర్తి బాధ్య‌త‌లు జిల్లా క‌లెక్ట‌ర్ కు అప్ప‌గించారు. అలాగే ఆల‌యం ప్రాంగ‌ణంలో ఏర్పాట్ల బాధ్య‌త‌ల‌ను పాల‌కుర్తి దేవ‌స్థానం ఇఓ లక్ష్మీ ప్ర‌స‌న్న‌కు అప్ప‌గించారు. పారిశుద్ద్యం, బారికేడ్లు, పార్కింగ్‌, ప్ర‌సాద విత‌ర‌ణ‌, హెలీ ప్యాడ్‌, బ‌స్సులు, గుట్ట‌పైన క‌ళ్యాణోత్స‌వం, పునః ప్ర‌తిష్టాప‌న, వాలంటీర్లు వంటి వాటిని ప‌ర్య‌వేక్షించ‌డానికి ప్ర‌త్యేకంగా గుట్ట‌పైన ఓ కంట్రోల్ రూంని ఏర్పాటు చేయ‌నున్నారు.

వెల్లువ‌లా విరాళాలు
ఈ కార్య‌క్ర‌మానికి దాత‌లు ముందుకు వ‌స్తున్నారు. వెల్లువ‌లా విరాళాలు వ‌స్తున్నాయి. నీటిపారుదల శాఖ డిఇఇ శ్రీ‌కాంత్ రూ.3 ల‌క్ష‌ల విరాళాన్నిఅక్క‌డే ప్ర‌క‌టించారు. ల‌క్ష్మ‌క్క ప‌ల్లికి చెందిన పుస్కూరి దయాకర్ రావు ప్ర‌క‌టించి ఇచ్చిన రూ.15 ల‌క్ష‌ల‌ను మంత్రి ఎర్ర‌బెల్లి అంద‌రి స‌మ‌క్షంలో ఇఓ కి అంద‌చేశారు. కాంట్రాక్ట‌ర్ వ‌ర్రె వెంక‌న్న రూ.5ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. బిఆర్ ఎస్ యువ‌జ‌న నాయ‌కుడు బ‌బ్బూరి శ్రీ‌కాంత్ రూ.24ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన వెండి విగ్ర‌హాల‌ను రామాల‌యానికి స‌మ‌ర్పించారు. వివేరా హోట‌ల్ య‌జ‌మాని న‌ర్సింహారెడ్డి 20వేల మందికి ప్ర‌సాదాలు అంద‌చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. మ‌రికొంద‌రు విరాళాలు ఇవ్వ‌డానికి ముంద‌కు వ‌చ్చారు.

క‌ళ్యాణోత్స‌వానికి రూ.516
క‌ళ్యాణోత్స‌వంలో పాల్గొనే దంప‌తులు రూ.516 చెల్లించాల‌ని నిర్ణ‌యించారు. ఈ మొత్తం కు ర‌శీదులు పొందాల‌ని, ఈ టికెట్లు తీసుకున్న వాళ్లంద‌రికీ ఆ రోజు క‌ళ్యాణోత్స‌వంలో పాల్గొనే అవ‌కాశం ఉంటుంద‌ని సంబంధిత అధికారులు తెలిపారు.

అదే రోజు సిఎం చేతుల మీదుగా మ‌రికొన్ని కార్య‌క్ర‌మాలకు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు
వ‌ల్మీడి శ్రీ సీతారామ‌చంద్ర స్వామి దేవాల‌య పునః ప్రారంభ కార్య‌క్ర‌మానికి విచ్చేస్తున్న సీఎం కెసిఆర్ చేతుల మీదుగా రూ.25 కోట్ల‌తో పాల‌కుర్తిలో నిర్మిస్తున్న ప‌ర్యాట‌క హోటల్ శంకుస్థాపన, మిషన్ భగీరథ అతిథి గృహం ప్రారంభోత్సవం, బ‌మ్మెర‌, పాల‌కుర్తిలోని మ‌రికొన్ని కార్య‌క్ర‌మాల‌కు ఒకే చోట నుంచి శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు ఉండే అవ‌కాశం ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ప‌ర్యవేక్షిస్తున్నారు.

రోప్ వే కు ప్రతిపాదనలు సిద్ధం చేయాల‌ని మంత్రి ఆదేశాలు
వ‌ల్మీడిలోని వాల్మీకి త‌ప‌స్సు చేశార‌ని చెబుతున్న మునుల గుట్ట – రాములోరి గుట్ట ల మ‌ధ్య ఒక రోప్ వే ని నిర్మిస్తే ఈ ప్రాంతం ప‌ర్యాట‌కంగా మ‌రింత‌గా అభివృద్ధి చెందే అవ‌కాశం ఉంది. ఇందు కోసం ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను మంత్రి ఎర్ర‌బెల్లి ఆదేశించారు.

వ‌ల్మీడిలో వేద పాఠశాల
వ‌ల్మీడి గ్రామంలో గుట్ట స‌మీపాన లేదా గుట్ట మీద కానీ ఒక వేద పాఠ‌శాల ఏర్పాటు చేస్తే బాగుంటుంద‌ని, ఇందుకు సంబంధించి ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

మొక్క‌లు నాటిన మంత్రి
రాములోరి గుట్ట‌కు వెళ్ళే దారిలో మొక్క‌లు నాటుతున్న ఉపాధి హామీ కూలీల‌తో క‌లిసి మంత్రి ద‌యాక‌ర్ రావు మొక్క‌లు నాటారు. మంచిగా మొక్క‌లు నాటాల‌ని సూచించారు.

విగ్ర‌హాల ఊరేగింపునకు ప్రారంభం
దేవాల‌యానికి స‌మ‌ర్పించిన వెండి విగ్ర‌హాల ఊరూరా ఊరేగింపు కార్య‌క్ర‌మానికి మంత్రి ద‌యాక‌ర్ రావు ప్రారంభోత్స‌వం చేశారు. ఆ వాహ‌నానికి కొబ్బ‌రి కాయ కొట్టి, ఆ విగ్ర‌హాల‌కు పూజ‌చేశారు.

ఆ నాలుగు రోజులపాటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి 4వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల కోసం ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా నడిపించాలని మంత్రి ఆర్టీసీ అధికారులకు చెప్పారు. పాలకుర్తి చుట్టుముంటున్న తొర్రూరు హనుమకొండ వరంగల్ జనగామ డిపోల నుండి బస్సులు ప్రత్యేకంగా వేయాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. బస్సులు నడిచే సమయాలను ముందే ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం నిర్వహించాలన్నారు.

సకుటుంబ సపరివార సమేతంగా తరలి రావాలి
పాలకుర్తి నియోజకవర్గం వరంగల్ ఉమ్మడి జిల్లా ఇతర ప్రాంతాల వారు అందరూ సకుటుంబ సపరివార సమేతంగా ఈ ఉత్సవాలకు హాజరుకావాలని మంత్రి దయాకర్ రావు పిలుపునిచ్చారు.

పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి
ఆర్టీసీ పోలీసు ఇతర అధికారులు గుట్ట సమీపంలో కింది భాగంలో పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ముందుగానే తగు స్థలాన్ని పరిశీలించి అందుకు తగిన విధంగా ఏర్పాటు చేసి వాహన సంబంధమైన సమస్యలేవీ రాకుండా రద్దీకి ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.

ఆ నాలుగు రోజులు సంస్కృతిక కార్యక్రమాలు
దేవాలయ ప్రాంగణంలో జరిగే నాలుగు రోజుల ఉత్సవాలలో ప్రతిరోజు సాయంత్రం ఒక రెండు, మూడు గంటల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. సినీ నేపద్య గాయని గాయకులు సంప్రదాయ నృత్య కళాకారులు పేరని కళాకారులు శివతాండవం భారత నాట్యం జానపద నృత్యాలు గేయాలు కోలాటాలు వంటి పలు తెలంగాణ కళా ప్రక్రియలో అవినీ దేశం ఉన్న వారిని ప్రత్యేకంగా పిలిపించి సాంస్కృతిక విభావరి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, డిసిపి సీతారాం, ఎసిపి సురేష్ కుమార్, ఆర్టీసీ, విద్యుత్, మంచినీటి సరఫరా, పోలీసు, పంచాయతీరాజ్, దేవాదాయ, డి ఆర్ డి ఓ వంటి వివిధ శాఖల అధికారులు మహిళలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తదితరులు పాల్గొన్నారు.