వాణిజ్య యుద్ధం భారత్‌కు మంచిదే

– మున్ముందు ఇవే పరిస్థితులు దేశంవేగంగా అభివృద్ధి చెందడానికి తోడ్పతాయి
– కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ) : ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం వల్ల కొంత అస్థిరత్వం ఏర్పడినప్పటికీ.. భవిష్యత్‌లో ఇది భారత్‌పై సానుకూల ప్రభావమే చూపనుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. వాణిజ్య యుద్ధం వల్ల భారత్‌లో క్రమంగా వాణిజ్య, తయారీ రంగంలో అవకాశాలు మెరుగుపడుతాయని జైట్లీ అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరుగుతున్న పీహెచ్‌డీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వార్షిక సదస్సులో జైట్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు భారత్‌పై కొంత ప్రభావం చూపిస్తున్నాయి. అయితే మున్ముందు ఇవే పరిస్థితులు దేశం వేగంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతాయి. వ్యాపార, తయారీ రంగంలో అవకాశాలు మెరుగుపడుతాయి. సవాళ్లు అవకాశాలుగా ఎప్పుడు మారుతాయి అనేది ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలి’ అని అన్నారు. పెరుగుతున్న చమురు ధరలు కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు సవాల్‌గా మారాయని జైట్లీ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారు భారత్‌ అని, దేశంలోని చమురు అవసరాలను తీర్చేందుకు 81శాతం దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోందన్నారు. అయితే ఈ సవాళ్లను అధిగమించే రోజు దగ్గర్లోనే ఉందని జైట్లీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్థిక నేరగాళ్లను జైట్లీ పరోక్షంగా హెచ్చరించారు. వ్యాపార సంస్థలు నైతిక విధానాలను అనుసరించాల్సిన  ఈవిధానాల వల్ల వ్యాపారాలు కూడా వృద్ధి చెందుతాయన్నారు. సంస్థలు తమ పన్ను బకాయిలను తప్పనిసరిగా
చెల్లించాల్సిందేనన్నారు. ఎందుకంటే రాత్రికి రాత్రే విదేశాలకు పారిపోకుండా దివాలా చట్టం అడ్డుకుంటుందన్నారు. రుణదాతల నుంచి డబ్బు తీసుకున్నప్పుడు ఆ అప్పును సరైన కాలంలో తీర్చాలని, అంతేగానీ.. డబ్బు ఇచ్చినందుకు రుణదాతలు నిద్రలేని రాత్రులు గడిపే స్థితి రాకూడదని జైట్లీ చెప్పుకొచ్చారు.