వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి

జంతర్‌మంతర్‌ వద్ద వాల్మీకి బోయ సంఘాల ధర్నా
మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆందోళన
న్యూఢిల్లీ,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లోని వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తదనుగుణంగా తక్షణం ఆర్డినెన్స్‌ జారీ చేయాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గ్రావిూణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద వాల్మీకి బోయ సంఘాల ప్రతినిధులతో కలసి మంత్రి కాలవ శ్రీనివాస్‌ ధర్నా నిర్వహించారు . ఆరు దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్‌ వాల్మీకి బోయలు తమ న్యాయమైన ఎస్‌ టి ¬దా సాధన కోసం అనేక పోరాటాలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాల్మీకి బోయల సమస్య పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ విషయంపై ప్రొఫెసర్‌ సత్యపాల్‌ కమిటీ చేత సమగ్ర అధ్యయనం చేయించారన్నారు.  తరువాత ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌టి, ఎస్‌సి కమిషన్‌ కూడా అనుకూలంగా సిఫారస్‌ చేసిందన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి మండలి దీనిపై తక్షణం ఆమోదించిందని మంత్రి కాల్వ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని వాల్మీకి బోయలను వెంటనే ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానం ప్రవేశ పెట్టారన్నారు .దాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించి 13 నెలల క్రితమే కేంద్రానికి పంపింది అని మంత్రి స్పష్టం చేశారు . అయితే కేంద్రంలోని  ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వాల్మీకి బోయలకు ఎస్టీ రిజర్వేషన్‌ కల్పించేందుకు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్న లేదన్నారు. గత పదమూడు నెలలు గా కేంద్ర ప్రభుత్వ  పరిపాలన లోనే ఈ సమస్య మగ్గిపోతున్నారు. అయితే ఇటీవల రాత్రికి రాత్రి ఉన్నపళంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి పది శాతం రిజర్వేషన్లు ఇస్తూ పార్లమెంటులో చట్ట సవరణ చేసి వెంటనే రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఇప్పించారు అని అన్నారు.  ఆర్థికంగా వెనుకబడిన వారిపై అంత ప్రేమ చూపిన ప్రధానికి వాల్మీకి బోయల విషయంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకని మంత్రి కాల్వ శ్రీనివాసులు దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేంద్రం తక్షణం స్పందించి ఆంధప్రదేశ్‌లోని వాల్మీకి బోయలను వెంటనే ఎస్టీలుగా గుర్తిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు . ఈ ధర్నాలో వాల్మీకి సంఘాల ప్రతినిధులు బిటి నాయుడు, పూలనాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ, ఆదినారాయణ , గంగాధర్‌,  నరేష్‌ , నరహరి , రమేష్‌,  కదిరప్ప , రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వీరి ధర్నా ప్రాంతానికి వచ్చి ఎంపీలు బుట్టా రేణుక నిమ్మల కిష్టప్ప వాల్మీకి బోయలకు సంఘీభావం ప్రకటించారు.