వాళ్లు నన్ను చూసి నవ్వలేదు..
– నాతో పాటే నవ్వారు
న్యూయార్క్, సెప్టెంబర్27(జనంసాక్షి) : ఐక్యరాజ్య సమితిలో తాను ప్రసంగిస్తున్న సమయంలో అక్కడి సభ్యులు నవ్వారని వస్తున్న వార్తలు అవాస్తవమని, వాళ్లు ఓ సందర్భంలో సరదాగా నాతో పాటు కలిసి నవ్వారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఐరాస సమావేశంలో అమెరికా గత రెండేళ్లలో సాధించిన పురోగతి గురించి ట్రంప్ మాట్లాడుతుండగా సభ్యులు నవ్వారని ట్రంప్‌కు ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందని బుధవారం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ ఓ విూడియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. తనను చూసి ఎవ్వరూ నవ్వలేదని, తనతోపాటు కలిసి నవ్వారని చెప్పారు. మేము సరదాగా ఉన్నామని, అది నన్నుచూసి నవ్వడం కాదన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్‌ను చూసి నవ్వారని నకిలీ వార్తలు వచ్చాయని, సభలో మేము చక్కని సమయం గడిపామని, కలిసి నవ్వాం అని ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ మంగళవారం ఐరాసలో చేసిన ప్రసంగంలో అమెరికా తన హయాంలో సాధించిన పురోభివృద్ధి గతంలో ఎన్నడూ సాధించలేదని, అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగా మెరుగైందని చెప్పుకొచ్చారు. సభలోని వివిధ దేశాల నేతలు హెడ్‌ఫోన్స్‌లో ట్రంప్ ప్రసంగాన్ని వారివారి భాషల్లో అనువాదం విన్నారు. అయితే అలా వింటూ నవ్వారని.. ట్రంప్ కొంత అసహనానికి గురై ఇలాంటి స్పందన తాను ఊహించలేదని అన్నారని వార్తలు వచ్చాయి.