వాళ్లు రాళ్లు రువ్వితే కాల్చి పారేయండి

 

ట్రాంప్‌ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): మెక్సికో వలసదారులు సైన్యంపై రాల్లు రువ్వితే కాల్చి పారేయండంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెక్సికో సరిహద్దు నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్న మధ్య అమెరికన్‌ వలదారులను ట్రంప్‌ తీవ్రంగా హెచ్చరించారు. మెక్సికో సరిహద్దు వద్ద ఉండే సైనికులపై రాళ్లు రువ్వితే కాల్పులు జరుపుతామని పేర్కొన్నారు. వలసదారులు అక్రమంగా సరిహద్దు దాటే సమయంలో విూపై రాళ్లు రువ్వితే వారిని కాల్చేయండి అంటూ ట్రంప్‌ సైనికులకు సూచించారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్‌ ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్య అమెరికాకు చెందిన వలసదారులు మెక్సికో విూదుగా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. మెక్సికో వద్ద సరిహద్దు దాటే సమయంలో భద్రతాసిబ్బందిపై రాళ్లు రువ్వుతున్నారు. ‘మేము చూస్తూ ఊరుకోము. వాళ్లు మా సైనికులపై రాళ్లు రువ్వితే.. మా మిలిటరీ కూడా తిరిగి పోరాడుతుంది. రాళ్లను రైఫిల్‌గా అనుకొమ్మని నేను మా సైనికులకు చెప్పాను’ అని ట్రంప్‌ తెలిపారు. అక్రమ వలసదారులను నియంత్రించే అంశంపై మాట్లాడుతూ ట్రంప్‌ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. దేశంలోకి అక్రమ వలసదారులు వచ్చేందుకు డెమోక్రాట్లు ఎదురుచూస్తున్నారంటూ ట్రంప్‌ విమర్శించారు. అక్రమ వలసదారుల వల్ల రకరకాల ముప్పులు పొంచి ఉన్నాయని చెప్పారు.