విద్యార్థి ఉద్యమ నాయకులకు న్యాయం చేసింది బీఆరెస్సే..
` దరువు ఎల్లన్నకు సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా: కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి): బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన విద్యార్థి ఉద్యమ నాయకుడు దరువు ఎల్లన్నకు మాటిస్తున్నా.. నీ గొంతును, శక్తిని వృథా కానివ్వం. తప్పకుండా తెలంగాణ కోసం నీ సేవలను బ్రహ్మాండగా ఉపయోగించుకుంటాం. నీకు వయసు, అనుభవం, చిత్తశుద్ధి ఉంది. ఉద్యమంలో పని చేసిన ఘనమైన నేపథ్యం ఉంది. కాబట్టి ఎల్లన్నకు సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అని కేటీఆర్ స్పష్టం చేశారు. దరువు ఎల్లన్న బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఉద్యమకారులకు, విద్యార్థి ఉద్యమ నాయకులకు బీఆర్‌ఎస్ పార్టీ కొంత మేర న్యాయం చేసింది.. ఇంకా చేయాలని దరువు ఎల్లన్న అన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే పదవుల నుంచి మొదలుకుంటే.. ఎంపీపీలు, జడ్పీటీసీల వరకు ఉద్యమకారులకు అవకాశం కల్పించాం. ఇవాళ విద్యార్థి ఉద్యమ నాయకులు, కళాకారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఎన్నో వర్గాల నుంచి ఉద్యమంలో పని చేసని వారికి న్యాయం చేసే ప్రయత్నం చేశాం. బాల్క సుమన్ ఎంపీ, ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. గ్యాదరి కిశోర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బొంతు రామ్మోహన్ మేయర్‌గా, ఎర్రోళ్ల శ్రీనివాస్, క్రిశాంక్, దూదిమెట్ల బాలరాజు, డాక్టర్ ఆంజనేయ గౌడ్ వంటి వారికి కార్పొరేషన్ల చైర్మన్‌లుగా నియమించాం. కళాకారుల విషయానికి వస్తే.. రసమయి బాలకిషన్‌ను ఎమ్మెల్యేగా చేసి, సాంస్కృతి సారథి చైర్మన్‌గా, గోరెటి వెంకన్నను ఎమ్మెల్సీగా నియమించాం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఉద్యమంలో కష్టపడ్డ కళాకారులందర్నీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, పే స్కేలు అమలు చేస్తున్నాం. గాయకుడు సాయిచంద్ భార్యకు రజనీకి కార్పొరేషన్ చైర్మన్ పదవి, కోటిన్నర ఇచ్చి ఆదుకున్నాం. ఏపూరి సోమన్న మళ్లీ తిరిగి కేసీఆర్ నాయకత్వంలో చేరారు. ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్‌ను మంత్రిని చేశాం. స్వామిగౌడ్‌ను ఎమ్మెల్సీ చేశాం. ఇలా ఎంతో మందికి గౌరవం కల్పించాం. కేసీఆర్ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైంది అని కేటీఆర్ స్పష్టం చేశారు.