విద్యార్థులపై భారం మోపనున్న పెట్రో ధరల పెంపు

స్కూలు బస్సు ఫీజులు పెంచేసిన బస్సు ఆపరేటర్లు

ముంబై,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): పెట్రోల్‌,డీజిల్‌ ధరల పెంపు ప్రభావం స్కూలు బస్సు ఫీజులపై పడింది. ఈ నష్టాన్ని మేమెలా భరించాలంటూ పిల్లలపై రుద్దేశారు. ముంబై నగరంలో స్కూలు బస్సు ఫీజును నెలకు వందరూపాయల మేర పెంచాలని స్కూలు బస్సు ఆపరేటర్లు నిర్ణయించారు. ముంబైలో పెట్రోల్‌ లీటరు ధర రూ.86.72, డీజిల్‌ ధర 75.74 రూపాయలకు పెంచారు. ఇంధన ధరల పెంపుతో స్కూలు బస్సు ఫీజులు పెంచాలని కోరుతూ తాము పాఠశాలలకు లేఖలు రాశామని స్కూలు బస్సు యజమానుల సంఘం ప్రతినిధి అనిల్‌ గార్గ్‌ చెప్పారు. గతుకుల రోడ్లపై స్కూలు బస్సులు నడపడం కష్టంగా మారిందని, ఇంధనం ధరలు పెరగడంతో బస్సు నిర్వహణ వ్యయం పెరిగిందని అనిల్‌ పేర్కొన్నారు. ముంబై నగరంలో 8వేల పాఠశాలలుండగా అక్టోబరు నెల నుంచి స్కూలు బస్సు చార్జీలు పెంచాలని నిర్ణయించారు. ఇంధన ధరల పెంపు వల్ల ప్రైవేటు టూరిస్టు బస్సుల ఛార్జీలు కూడా పెంచారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల లబోదిబోమంటున్నారు.