విరాళం ఇచ్చిన భర్త: కోర్టుకెక్కిన భార్య
ఇస్లామాబాద్,నవంబర్13(జనంసాక్షి): పాకిస్థాన్‌లో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన డ్యామ్ కోసం ఓ వ్యక్తి భారీ మొత్తంలో తన ఆస్తులను విరాళంగా ప్రకటించాడు. అయితే తమ అనుమతి లేకుండానే ఈ విరాళాన్ని ప్రకటించాడని కుటుంబసభ్యులు కోర్టుకెక్కడంతో.. అతని మానసిక పరిస్థితిని పరీక్షించాలని పాక్‌లోని ఓ న్యాయస్థానం ఆదేశించింది. రూ.8 కోట్ల విలువైన ఆస్తులను షేక్ షాహిద్ అనే వ్యక్తి ప్రాజెక్టు నిధికి విరాళంగా ప్రకటించాడు. తన భర్త షేక్ షాహిద్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడని భార్య కోర్టుకు తెలిపింది. దీంతో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి అధికారులను ఆదేశించినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. షరియా చట్టం ప్రకారం వారసుల అనుమతి లేకుండా విరాళం ఇవ్వడం కుదరదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. భవిష్యత్తులో దేశ నీటి అవసరాలు తీర్చేందుకు భారీ జలాశయాన్ని నిర్మించ తలపెట్టామని, ఇందుకోసం విదేశాల్లో నివసించే పాకిస్థానీలు
విరాళాలు ఇవ్వాల్సిందిగా గతంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.