వివాహ వేడుకల్లో అపశృతి

పుడ్‌పాయిజనింగ్‌తో పలువురు ఆస్పత్రిలో చేరిక
లక్నో,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): వివాహ వేడుకల్లో జరిగిన విందులో ఆహారం తిన్నవారికి పుడ్పాయిజనింగ్‌ జరిగింది. దీంతో వీరంతా ఆస్పత్రిలో చేరారు. యూపీలోని ఫిరోజాబాద్‌ మెడికల్‌ కాలేజీకి చెందిన ట్రామా సెంటర్‌లో వందకు మించిన ఫుడ్‌ పాయిజనింగ్‌ బాధితులు చేరారు. వీరిలో వృద్ధులు, చిన్నారులు, మహిళలు అధికసంఖ్యలో ఉన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత భారీ సంఖ్యలో బాధితులు ఆసుపత్రికి రావడంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది వెంటనే వారికి చికిత్స ప్రారంభించింది. వివరాల్లోకి వెళితే నారఖీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని డూమర్‌ హరీనగర్‌ ఒక వివాహ వేడుక జరిగింది. తరువాత విందు కార్యక్రమం ఏర్పాటుచేశారు. అక్కడ భోజనం చేసిన వారంతా కొద్ది సేపటికే అనారోగ్యం పాలయ్యారు. దీంతో వీరినందరినీ స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో తగిననన్ని బెడ్‌లు లేకపోవడంతో ఒకే బెడ్‌పై ఇద్దరు ముగ్గురిని పడుకోబెట్టి చికిత్సనందిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి చికిత్సనందిస్తున్న డాక్టర్‌ పాండ్యా మాట్లాడుతూ ఆసుపత్రికి రాత్రిపూట ఫుడ్‌పాయిజనింగ్‌ బాధితులు భారీ సంఖ్యలో వచ్చారని, వెంటనే వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి, వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. అలాగే నీరు, ఇతర ఆహారపదార్థాల శాంపిళ్లను సేకరించి పరిశీలిస్తున్నామని తెలిపారు.