విూకెందుకు ఓటెయ్యాలో చెప్పండి?

– బీహార్‌ రాజకీయం గురించి మాటలెందుకు
– ట్విట్టర్‌లో చంద్రబాబుపై కౌంటర్‌ వేసిన ప్రశాంత్‌ కిశోర్‌
అమరావతి, మార్చి19(జ‌నంసాక్షి) : ఏప్రిల్‌ 11న ఏపీలో పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచార పర్వం హీటెక్కింది. ప్రధానంగా అధికార పార్టీ తెదేపా, ప్రతిపక్ష పార్టీ వైకాపాలకు
చెందిన నేతలు చేస్తున్న విమర్శనాస్త్రాలతో రాజకీయ ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. ఓ పక్క అభ్యర్థులను ప్రకటిస్తూనే.. మరోపక్క చంద్రబాబు ప్రచార పర్వంలోనూ దూసుకెళ్తున్నారు. దీనిలో భాగంగా  రోజుకు నాలుగైదు సభల్లో చంద్రబాబు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌పైనా, మరోవైపు బీజేపీ, కేసీఆర్‌లపై తీవ్రస్థాయిలో చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. కాగా మరోవైపు వైసీపీకి వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్‌ కిషోర్‌పైనా చంద్రబాబు విమర్శలు ఎక్కుపెట్టారు. బీహార్‌ నుంచి ఓ వ్యక్తి వైకాపాను నడిపిస్తున్నాడని, బీహార్‌లో లా అండ్‌ ఆర్డర్‌ సరిగా ఉండని, అక్కడ బందిపోటులదే రాజ్యమని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా బీహార్‌ నుంచి ఓ బందిపోటు వచ్చి మన రాష్ట్రంలో దొంగ పార్టీకి సలహాలిస్తూ ఏపీని మరో బీహార్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ఈ విమర్శలపై వైకాపా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ తాజాగా స్పందించారు. తనకు ఓటేయాలని కోరుతున్న నారా చంద్రబాబునాయుడు, తనకు ఎందుకు ఓటు వేయాలో కూడా చెప్పాలని ప్రశాంత కిశోర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ పెట్టిన ఆయన పలు విమర్శలు చేశారు. ఓటమి దగ్గర పడినట్టు తెలుస్తుంటే, ప్రముఖ రాజకీయనాయకులు సైతం ఆందోళనలో ఉంటారు. అందువల్ల నేను చంద్రబాబునాయుడు చేస్తున్న నిరాధార ఆరోపణలపై ఆశ్చర్యపోవడం లేదు. సార్‌… బీహార్‌ కు వ్యతిరేకంగా విూ  దురభిమానం మరియు దురభిమానాన్ని చూపించే అవమానకరమైన భాషని ఉపయోగించకుండా, విూకు మళ్లీ ఏపీ ప్రజలు ఎందుకు వేయాలన్న విషయంపై దృష్టిని సారించాలని కోరుతున్నా అంటూ చంద్రబాబుకు కౌంటర్‌ వేశారు.